విద్యార్థులు వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

by Kodari Anjali |

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

విద్యార్థులు వెనుకబడ్డ సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్
X

దిశ, గద్వాల కలెక్టరేట్: ప్రభుత్వ పాఠశాలలోనే నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి అక్కడి ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి ఉపాధ్యాయుల వివరాలు అడిగారు. పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన కమిటీని విద్యార్థులతో ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయించాలన్నారు. తరగతి గదులతో పాటు పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

గతేడాది టాపర్స్‌గా నిలిచిన విద్యార్థుల కంటే..

పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, తదితర సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు వెనుకబడ్డ సబ్జెక్టుల్లో ప్రత్యేక దృష్టి సారిస్తే పదవ తరగతిలో మంచి మార్కులు పొందేందుకు అవకాశం ఉందన్నారు. గతేడాది టాపర్స్‌గా నిలిచిన విద్యార్థుల కంటే ఈ విద్యా సంవత్సరంలో ప్రస్తుత విద్యార్థులు బాగా చదివి ఇంకా ఎక్కువ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. సెలవులను ఎలా సద్వినియోగం చేసుకున్నారని, సమ్మర్ స్పెషల్ తరగతులకు ఎంతమంది హాజరయ్యారని అడిగారు. విద్యార్థులకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేయడం జరిగిందని, త్వరలోనే ఏకరూప దుస్తులను కూడా ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

Next Story