- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లైన్‌మెన్‌ను విధుల నుంచి బహిష్కరించాలి.. సబ్‌స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా
వేలాది రూపాయల జీతం తీసుకుంటూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కొందరు విద్యుత్ సిబ్బంది సాధారణ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దిశ, చిట్యాల: వేలాది రూపాయల జీతం తీసుకుంటూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కొందరు విద్యుత్ సిబ్బంది సాధారణ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరెంటు స్తంభంపై ఏర్పడిన లోపాన్ని సరిచేయడానికి ప్రభుత్వ ఉద్యోగి అయిన లైన్‌మెన్ బోధ వెంకటేశ్వర్లు ప్రైవేటు వ్యక్తిని స్తంభంపైకి ఎక్కించడంతో, ప్రమాదవశాత్తు అతను కిందపడిపోయి చేతులు, కాళ్లు తీవ్రంగా దెబ్బతిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటన చిట్యాల మండలంలోని వట్టిమర్తి గ్రామంలో ఇటీవల చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే రెండు వారాల క్రితం వట్టిమర్తి గ్రామంలో విద్యుత్ సమస్యను సరిచేయడానికి గ్రామ లైన్‌మెన్ వెంకన్న, అదే గ్రామానికి చెందిన జాల మనోజ్ అనే యువకుడిని కరెంటు స్తంభం ఎక్కించాడు. మనోజ్‌కు విద్యుత్ స్తంభాలు ఎక్కిన అనుభవం లేకపోయినప్పటికీ, కూలి డబ్బులు ఇస్తానని చెప్పి మభ్యపెట్టి పనికి ఒప్పించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనుభవం లేకపోవడంతో, తగిన భద్రతా చర్యలు లేకుండా స్తంభంపై పనిచేస్తున్న సమయంలో మనోజ్ ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం, అతని చేతులు, కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, జీవితాంతం అంగవైకల్యంతో జీవించాల్సి వస్తుందని వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడికి ఎలాంటి అనుభవం లేకపోయినా డబ్బు ఆశ చూపించి స్తంభం ఎక్కించడమే ఈ దుర్ఘటనకు కారణమని, దీనికి పూర్తిగా లైన్‌మెనే బాధ్యుడని వారు ఆరోపిస్తున్నారు.
దీనికి బాధ్యులు ఎవరు..?
గ్రామంలో విద్యుత్‌కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా సంబంధిత లైన్‌మెన్ పూర్తి బాధ్యతతో దాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. ఇందుకోసం నైపుణ్యం కలిగిన హెల్పర్లను నియమించి వారిచే స్తంభాలపై పనులు చేయించాలి. అయితే ఈ ఘటనలో హెల్పర్ స్తంభం ఎక్కలేనని చెప్పడంతో, అనుభవం లేని మనోజ్‌ను కూలి ఇస్తానని చెప్పి స్తంభంపైకి ఎక్కించినట్లు తెలుస్తోంది. దీంతో స్తంభాలు ఎక్కిన అనుభవం లేని మనోజ్ పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ఈ ప్రమాదం కారణంగా అతను జీవితాంతం అంగవైకల్యంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనకు అసలు బాధ్యులు ఎవరు అనే అంశంపై గ్రామంలో తీవ్ర చర్చ జరుగుతోంది. వేలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న విద్యుత్ సిబ్బంది, నైపుణ్యం ఉన్న వ్యక్తుల చేత పనులు చేయించకుండా డబ్బు ఆశ చూపి అనుభవం లేని వ్యక్తులను ప్రమాదంలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
సబ్‌స్టేషన్ ముందు గ్రామస్తుల ధర్నా
ఈ ఘటన జరిగి దాదాపు రెండు వారాలు గడిచినా సంబంధిత లైన్‌మెన్ వెంకటేశ్వర్లు ఎలాంటి స్పందన చూపకుండా, తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల అండదండలతోనే సదరు లైన్‌మెన్ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాడని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు సోమవారం చిట్యాల పట్టణంలోని సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. వెంటనే సంబంధిత ఎస్‌ఈ వచ్చి వివరణ ఇవ్వాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన లైన్‌మెన్‌ను వెంటనే విధుల నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
అలాగే చేతులు, కాళ్లు కోల్పోయి పూర్తి అంగవైకల్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనోజ్‌కు విద్యుత్ శాఖ పూర్తి బాధ్యత వహించి, తగిన నష్టపరిహారం చెల్లించి అతని కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఈ ఘటన పై లైన్‌మెన్ బోధ వెంకటేశ్వర్లు ఇప్పటివరకు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అందుబాటులో లేకపోవడంతో పాటు, వట్టిమర్తిలో విధులు నిర్వహిస్తూ నివాసం మాత్రం హైదరాబాద్‌లో ఉండి రెండు, మూడు రోజులకు ఒకసారి మాత్రమే గ్రామానికి వస్తాడని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటన పై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు, విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.






