గాంధీభవన్‌లో మళ్ళీ రచ్చ.. జహీరాబాద్‌ కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తత

by Prasad Jukanti |   (  Updated:2026-06-15 11:18:54  IST  )

గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు వరుస గొడవలు కలకలం రేపుతున్నాయి. ఫిరోజ్ ఖాన్ ఘటన మరువక ముందే తాజాగా జహీరాబాద్ నేతల ఆందోళన సంచలనంగా మారింది.

గాంధీభవన్‌లో మళ్ళీ రచ్చ..  జహీరాబాద్‌ కాంగ్రెస్ నేతల ఆందోళన ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌ గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. క్రమశిక్షణతో వ్యవహరించాల్సిన నేతలు ఏకంగా పార్టీ స్టేట్ కార్యాలయంలోనే బాహాబాహీకి దిగుతూ రచ్చ చేస్తున్నారు. గత నెలలో మల్లురవితో ఆ పార్టీ కార్పొరేటర్లు గొడవకు దిగగా రెండు వారాల క్రితం ఏకంగా మంత్రి, ముఖ్య నేతల ఎదుటే ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజ్రీ కోట్లాటకు దిగడం కలకలం రేపింది. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా ఇవాళ గాంధీభవన్‍లో జహీరాబాద్ నేతలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నేత, జహీరాబాద్ నియోజకవర్గం ఇన్ చార్జి చంద్రశేఖర్‍కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రశేఖర్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే పదవులు ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వెంటనే అతడిని పదవి నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.

పార్టీలో మళ్లీ పాత కొత్త చర్చ:

జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి చంద్రశేఖర్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. అయితే 2023 ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు చేతిలో ఓటమి పాలుకాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంస్థాగత నియమాకాల్లో ఆయన తన వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా పార్టీనే నమ్ముకున్న వారిని కాదని తన వెంట పార్టీలో చేరిన కొత్త నేతలకు పదవులు పంచిపెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఈ పంచాయతీ నియోజకవర్గం వరకే ఉండగా తాజాగా గాంధీభవన్ వరకు పాకడం హాట్ టాపిక్‍గా మారింది.

Next Story