కొరియన్ యూట్యూబర్‌ను భారత్‌లో లైంగికంగా వేధించారా?.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇది!

by Malleboina Mahesh |

కొరియన్ యూట్యూబర్ గర్భవతి వేషంలో భారత్‌లో తిరిగాడని, అతనిపై వేధింపులు జరిగాయన్న సోషల్ మీడియా ప్రచారం ఫేక్ అని పీటీఐ తేల్చింది.

కొరియన్ యూట్యూబర్‌ను భారత్‌లో లైంగికంగా వేధించారా?.. వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇది!
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజుల క్రితం ఓ కొరియన్ యూట్యూబర్‌ను భారత్ లో లైంగికంగా వేదించారంటూ చూపించే వీడియో వైరల్ అయింది. ఆ వైరల్ వీడియో పై పలువురు తీవ్రస్థాయిలో స్పందిస్తూ.. విదేశి పర్యాటకులకు భారత్ లో రక్షణలేదంటు మండిపడ్డారు. కాగా ఆ వైరల్ వీడియో పై స్పందించిన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) ఫ్యాక్ట్ చెక్ డెస్క్ కీలక విషయాలను వెల్లడించింది. భారతదేశంలో మహిళల భద్రతను పరీక్షించడానికి ఒక దక్షిణ కొరియా యూట్యూబర్ గర్భవతియైన మహిళలా మారువేషంలో తిరిగాడని, ఆ సమయంలో అతని పై తీవ్రమైన లైంగిక వేధింపులు జరిగాయంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా అబద్ధమని పీటీఐ (PTI) ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది.

రెండు వేర్వేరు దేశాలలో, భిన్న సందర్భాలలో రికార్డ్ చేసిన దృశ్యాలను కావాలనే ఎడిట్ చేయడం ద్వారా ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని పీటీఐ గుర్తించింది. మే 2025లో సదరు యూట్యూబర్ వారణాసిలో ఒక సాధారణ పురుషుడి రూపంలో హోలీ వేడుకల్లో పాల్గొన్న వీడియోను, ఏప్రిల్ 2026 లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వీధుల్లో గర్భవతిలా మారువేషం వేసి చేసిన సోషల్ ఎక్స్‌పెరిమెంట్ వీడియోను కలిపేసి ఈ ఫేక్ కథనాన్ని సృష్టించినట్లు పీటీఐ పేర్కొంది.

ఈ అంతర్జాతీయ దుష్ప్రచారంపై సదరు సౌత్ కొరియన్ యూట్యూబర్ సుమిన్ స్వయంగా స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను భారతదేశంలో ఎంతో సంతోషంగా హోలీ ఆడానని, బంగ్లాదేశ్‌లో తాను చేసిన లేడీ గెటప్ వీడియోను దీనికి లింక్ చేస్తూ కొంతమంది కావాలనే భారతదేశంపై అంతర్జాతీయంగా ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన పాత వీడియోలను దుర్వినియోగం చేస్తూ, రెండు దేశాల విజువల్స్‌తో భారత్‌ను తప్పుదోవ పట్టించేలా చూపిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా భారత దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రగా పీటీఐ ఫ్యాక్ట్ చెక్ ద్వారా నిరూపితమైంది.

Next Story