రండి.. పెట్టుబడులు పెట్టండి: మంత్రి శ్రీధర్‌బాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-12 14:52:33  IST  )

గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు...

రండి.. పెట్టుబడులు పెట్టండి: మంత్రి శ్రీధర్‌బాబు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్లోబల్ లాజిస్టిక్స్ డెస్టినేషన్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో శుక్రవారం హెచ్ఐసీసీ నోవాటెల్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ 2026కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ రంగంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఫ్యూచర్ రెడీ ఎకో సిస్టంను చిత్తశుద్ధితో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఎగుమతుల సన్నద్ధత సూచీలో దేశవ్యాప్తంగా తెలంగాణ ఎనిమిదో స్థానంలో నిలిచిందన్నారు. సముద్ర తీరం లేని రాష్ట్రాల (ల్యాండ్‌లాక్డ్) జాబితాలో రెండో స్థానంలో ఉన్నదన్నారు. మర్చండైజ్ ఎగుమతుల్లో దేశంలోనే ఏడో స్థానంలో నిలవడం తెలంగాణ పారిశ్రామిక వృద్ధికి నిదర్శనమన్నారు.

తెలంగాణ రైజింగ్ - 2047’ విజన్ లక్ష్యసాధనలో లాజిస్టిక్స్ రంగం కీలక పాత్ర పోషించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. తెలంగాణకు సముద్ర తీరం లేకపోవడాన్ని ఒక పరిమితి(లిమిటేషన్)గా కాకుండా, ఒక డిజైన్ అడ్వాంటేజ్‌గా మార్చుకుంటున్నామన్నారు. లాజిస్టిక్స్ పాలసీ 2.0 ద్వారా రాష్ట్రంలో మెగా మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్, డ్రై పోర్టులు, బాండెడ్ వేర్‌ హౌజింగ్, లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయబోతున్నామన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్‌ను లాజిస్టిక్ రంగంలోనూ సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నామన్నారు.

మల్టీ మోడల్ లాజిస్టిక్స్, రైల్ లింక్డ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్ కార్గో, కోల్డ్ చైన్, గ్రేడ్ - ఏ వేర్ హౌజింగ్, ఆటోమేషన్, డిజిటల్ లాజిస్టిక్ ప్లాట్ ఫామ్స్, గ్రీన్ మొబిలిటీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ ఆర్.రవికుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేకే మహేశ్వరి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గరిమెళ్ల, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ కమిటీ ఛైర్మన్ కమల్ జైన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story