రోడ్డు భద్రత.. సామాజిక బాధ్యత....

by Taduka Kalyani |

రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

రోడ్డు భద్రత.. సామాజిక బాధ్యత....
X

దిశ, హుస్నాబాద్: రోడ్డు భద్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యతని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్స్‌లో నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్యపు చర్యలే ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటి పెద్ద ప్రమాదంలో కోల్పోతే ఆ కుటుంబం ఎదుర్కొనే వేదన వర్ణనాతీతమన్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంటలో బాధితుడిని ఆసుపత్రికి తరలించే ‘గుడ్ సమరిటన్’లకు కేంద్రం రూ. 25 వేల నగదు ప్రోత్సాహకంతో పాటు ‘రహవీర్ అవార్డు’ అందజేస్తుందని తెలిపారు. హుస్నాబాద్‌ను రోడ్డు భద్రత నిబంధనలు పాటించే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా సీపీఆర్ (CPR) ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు ప్రమాదాలకు గల కారణాలను వీడియోల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం మంత్రి ఆటో డ్రైవర్లకు యూనిఫాంలు, వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అక్టోబర్ 2 నాటికి జాతీయ రహదారి పనులు పూర్తి కావాలి

అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ నేషనల్ హైవేస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్కతుర్తి-సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసి, అక్టోబర్ 2వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్స్’ను గుర్తించి అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రహదారికి ఇరువైపులా భారీగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి వారం పనుల పురోగతిపై నివేదికలు అందించాలని స్పష్టం చేశారు.

Next Story