- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీజిల్ పొదుపు ఉద్యోగుల సామాజిక బాధ్యత : ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి
పెరుగుతున్న డీజిల్ ధరలతో సంస్థపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, నిరంతరం పెరుగుతున్న డీజిల్ ధరల నేపథ్యంలో సంస్థపై పడుతున్న భారీ నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్ లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆధ్వర్యంలో డీజిల్ నిర్వహణ- అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఇది రవాణా రంగంపై, ముఖ్యంగా ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఈ సందర్భంగా ఎండీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక భారాన్ని సమర్థవంతంగా అధిగమించాలంటే డీజిల్ వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, ప్రతి లీటరు ఇంధనాన్ని పొదుపుగా వాడుతూ వృథాను అరికట్టడం ఒక్కటే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం డిపోల స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవాలని, వాహనాల ఫిట్‌నెస్‌తో పాటు ఉత్తమ నిర్వహణ పద్ధతులను నిరంతరం అలవర్చుకోవాలని అధికారులకు, సాంకేతిక సిబ్బందికి సూచించారు.
కేవలం ఇదొక విధి నిర్వహణ మాత్రమే కాదని, ప్రతి ఉద్యోగికి ఇంధన పొదుపుపై ఒక సామాజిక బాధ్యత ఉండాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డీజిల్‌ను ఆదా చేయడం ద్వారా సంస్థను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా మన వంతు సహకారం అందించినవారమవుతామని పేర్కొన్నారు. బస్సుల మైలేజీని (కేఎంపీఎల్) గణనీయంగా పెంచడానికి, గ్యారేజ్ పరిధిలో సాంకేతిక లోపాలను సకాలంలో గుర్తించి నివారించడానికి తీసుకోవాల్సిన వివిధ రకాల జాగ్రత్తలపై ఈ సందర్భంగా నిపుణులు సిబ్బందికి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. సదస్సులో ఈడీ సీహెచ్.వెంకన్న, ఫైనాన్సియల్ అడ్వైజర్ విజయపుష్ప, బీపీసీఎల్ తెలంగాణ హెడ్ లక్ష్మీ లాల్ చౌహన్, మార్కెటింగ్ మేనేజర్ రఘునాథరావ్, ఆర్టీసీ సీసీఎస్ ప్రభులత, పలువురు డిప్యూటీ ఆర్ఎంలు, డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
- Tags
- TGSRTC
- Telugunews






