ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయితో మంత్రి ఉత్తమ్ భేటీ

by Malleboina Mahesh |   (  Updated:2026-06-12 17:32:16  IST  )

సమ్మక్క-సారక్క బ్యారేజీ అనుమతుల కోసం ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయితో మంత్రి ఉత్తమ్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన సమ్మక్క-సారక్క బ్యారేజ్/సమ్మక్క సాగర్ ప్రాజెక్టు అనుమతుల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో కీలక ముందడుగు పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. గురువారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయితో మంత్రి ఉత్తమ్ నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారుల బృందంతో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిర్మించతలపెట్టిన సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం తుది పరిశీలనకు తీసుకెళ్లేందుకు అవసరమైన ఎన్‌వోసీ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అధికారిక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి జలాల వినియోగం, పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తి, రైతాంగానికి శాశ్వత సాగునీటి భద్రత కల్పించడం వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సమ్మక్క-సారక్క బ్యారేజ్ రాష్ట్ర రైతాంగానికి కీలకమైన ప్రాజెక్టు అని వివరించారు. ఛత్తీస్‌గఢ్ సీఎం మన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారని.. అంశాన్ని సానుభూతితో పరిశీలిస్తామని హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు.

అన్ని ప్రధాన డైరెక్టరేట్ల నుంచి అనుమతులు..

కేంద్ర జల సంఘంలోని అంతర్రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ మినహా మిగతా అన్ని ప్రధాన డైరెక్టరేట్ల నుంచి ప్రాజెక్టుకు ఇప్పటికే అనుమతులు లభించాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ఎన్‌వోసీ లేకపోవడం వల్ల డీపీఆర్ తుది పరిశీలన నిలిచిపోయిన విషయాన్ని ఛత్తీస్‌గఢ్ సీఎంకు తెలిపారు. ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారని తెలిపారు. మరింత ఖచ్చితమైన సర్వే కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందన్నారు.

సర్వే ఖర్చుల కోసం రూ.9.883 కోట్లను 2026 ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ జలవనరుల శాఖకు విడుదల చేసినట్లు వివరించారు. ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో సర్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ముంపు లేదా బ్యాక్‌వాటర్ ప్రభావిత భూములు గుర్తించిన పక్షంలో చట్టబద్ధంగా పరిహారం చెల్లించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే పరిహార మొత్తాన్ని ముందుగానే డిపాజిట్ చేసేందుకూ సిద్ధంగా ఉన్నామన్నారు.

గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీరు మళ్లింపు

సమ్మక్క–సారక్క ప్రాజెక్టు మూలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పీవీ నరసింహారావు కంఠనపల్లి సుజల స్రవంతి పథకంలో ఉన్నాయని మంత్రి వివరించారు. గోదావరి నదిపై కంఠనపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించి ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 ఆయకట్టును స్థిరీకరించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందన్నారు. 2009 ఫిబ్రవరి 10న జారీ చేసిన జీఓ 27 ద్వారా ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతి లభించిందని, 2012 మార్చి 2న కేంద్ర జల సంఘం డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటిపారుదల రంగ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రాజెక్టును పునఃరూపకల్పన చేశారని తెలిపారు. సాంకేతిక అధ్యయనాల అనంతరం బ్యారేజ్‌ను ములుగు జిల్లాలోని తూపాకులగూడెం వద్ద నిర్మించడం సాంకేతికంగా, ఆర్థికంగా మరింత ప్రయోజనకరమని తేలిందన్నారు.

ఈ మార్పుతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ముంపు ప్రభావం గణనీయంగా తగ్గిందని వివరించారు. సమ్మక్క–సారక్క బ్యారేజ్ ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించి ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. అదనంగా రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాలకు కొత్తగా సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో 2,34,199, మహబూబాబాద్ జిల్లాలో 96,494, ఖమ్మం జిల్లాలో 85,774, వరంగల్ జిల్లాలో 22,422, జనగామ జిల్లాలో 1,111 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

అలాగే.. రామప్ప-పాకాల లింక్ కాలువ ద్వారా ములుగు జిల్లాలో 8,000 ఎకరాలు, వరంగల్ నర్సంపేట ప్రాంతంలో 22,000 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇదే కాకుండా జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలోని కొంత ఆయకట్టు స్థిరీకరణకు కూడా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందలాది గ్రామాలకు తాగునీటి ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతుండటం, తెలంగాణ ప్రభుత్వం అవసరమైన నిధులు విడుదల చేయడం, ముంపు ప్రభావితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ముందుకు రావడం, రెండు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనడం వల్ల ఎన్‌వోసీ త్వరలోనే లభించే అవకాశాలు మెరుగయ్యాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story