జర్నలిస్టులకు అండగా నిలబడడం సమాజ బాధ్యత : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ నిత్యం 24/7 ప్రజాసేవలో నిమగ్నమై ఉండే జర్నలిస్టుల సంక్షేమానికి దాతలు ముందుకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

జర్నలిస్టులకు అండగా నిలబడడం సమాజ బాధ్యత :  ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ నిత్యం 24/7 ప్రజాసేవలో నిమగ్నమై ఉండే జర్నలిస్టుల సంక్షేమానికి దాతలు ముందుకు రావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం నిధికి ఆయన ప్రతినెల ఇచ్చే 1 లక్ష రూపాయల చెక్కును శుక్రవారం అందజేసి మాట్లాడారు. ప్రజలకు సమాచారం అందించే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పేద జర్నలిస్టులకు అవసరమైన సమయంలో అండగా నిలవడం సమాజ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ శాసనసభ్యుల జీతంలో 50 శాతం కోత విధించినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రతి నెలా 1 లక్ష రూపాయలు అందజేయడం ఎమ్మెల్యే గా ఆయనకు ఉన్న గొప్ప లక్షణమని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమం నాటి నుంచే జర్నలిస్టుల పరిస్థితులను దగ్గరగా గమనించిన ఆయన, జర్నలిస్టుల సంక్షేమం కోసం మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని, ఆయన ఆలోచనతోనే అనేక మంది జర్నలిస్టులు ఆర్థిక సహాయం పొందుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు పల్లెమోని యాదయ్య, రఘు, పరిపూర్ణం, సతీష్ కుమార్, కేశవులు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ఆధార్ సేవా కేంద్ర సేవలను వినియోగించుకోండి..

పట్టణంలో ఆధార్ సేవా కేంద్రం అందిస్తున్న సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. శుక్రవారం మహబూబ్ నగర్ లోని గణేష్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. 'సమన ఆధార్' మన గుర్తింపు కాబట్టి ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు, సవరణలు ఉన్న ఎలాంటి సందేహం లేకుండా ఈ ఆధార్ సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలన్నారు. ఆధార్ కార్డును పివిసి కార్డు రూపంలో ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ వెన్నెల రఘు, పాలమూరు యూనివర్సిటీ ఓఎస్డీ టు వైస్ ఛాన్సలర్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, గోవింద్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story