బంజారాహిల్స్ నిలోఫర్ కెఫే‌కు బిగ్ షాక్ !

by Naga Rani Yarlagadda |

హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ప్రముఖ 'నిలోఫర్ కేఫే' కు తెలంగాణ అగ్నిమాపక శాఖ భారీ షాక్ ఇచ్చింది.

బంజారాహిల్స్ నిలోఫర్ కెఫే‌కు బిగ్ షాక్ !
X
  • నిబంధనల ఉల్లంఘన.. ఫైర్ ఎన్‌ఓసీ రద్దు
  • భవనంలో అగ్నిమాపక శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
  • అనుమతుల్లేకుండా 4వ అంతస్తులో పూర్తిస్థాయి రెస్టారెంట్ నిర్వహణ
  • ప్రజల ప్రాణాలకు ముప్పు : ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ సీరియస్ యాక్షన్

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ప్రముఖ 'నిలోఫర్ కేఫే' కు తెలంగాణ అగ్నిమాపక శాఖ భారీ షాక్ ఇచ్చింది. అగ్నిమాపక భద్రతా నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, ఎలాంటి అనుమతులు లేకుండా నాలుగో అంతస్తులో రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. ఆ భవనానికి జారీ చేసిన ఫైర్ ఎన్‌ఓసీ ను తక్షణమే రద్దు చేశారు. కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా అధికారులు స్పష్టం చేశారు.

ఆకస్మిక తనిఖీలతో వెలుగులోకి.. ఇటీవల నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు, వాటివల్ల సంభవిస్తున్న ప్రాణ, ఆస్తి నష్టాల నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అప్రమత్తమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని నిలోఫర్ కేఫే వాణిజ్య భవనం (డోర్ నెం. 8-2-682/P2, P3)లో ఫైర్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఫైర్ లైసెన్స్ నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం పలు అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. భవన నిర్మాణ ప్లాన్, అగ్నిమాపక శాఖ అనుమతులకు విరుద్ధంగా.. భవనంలోని నాల్గవ అంతస్తు పైభాగంలో ఎలాంటి పర్మిషన్ లేకుండా పూర్తి స్థాయి రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. ఇరుకైన మార్గాలు, నిబంధనల ఉల్లంఘనల కారణంగా అగ్నిప్రమాదం జరిగితే కస్టమర్ల ప్రాణాలకు, ఆస్తులకు తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తనిఖీ నివేదికలో స్పష్టం చేశారు.

డీజీ సీరియస్..

లైసెన్స్ రద్దు అధికారుల తనిఖీ నివేదికను, ప్రజల ప్రాణాలకు ఉన్న తక్షణ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ .. నిలోఫర్ కేఫే సంస్థకు గతంలో జారీ చేసిన ఫైర్ ఎన్‌ఓసీని తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉల్లంఘిస్తే ఉపేక్షించం: డీజీ విక్రమ్ సింగ్ మాన్... ఈ సందర్భంగా డీజీ విక్రమ్ సింగ్ మాన్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణకు ప్రజలు, వాణిజ్య సంస్థలు అవసరమైన అన్ని భద్రతా చర్యలు కచ్చితంగా పాటించాలి. ఫైర్ లైసెన్స్ పొందిన సంస్థల యజమానులు లైసెన్స్ నిబంధనలకు లోబడే వ్యాపారాలు నిర్వహించాలి. నిబంధనలు ఉల్లంఘించి అదనపు నిర్మాణాలు చేపట్టినా, అనుమతి లేని వ్యాపారాలు నిర్వహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజల ప్రాణభద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం అని ఆయన హెచ్చరించారు.

Next Story