- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ సవరణ బిల్లు, ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్ (సవరణ) బిల్లు-2025తో పాటు దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యుత్ రంగ ప్రైవేటీకరణ చర్యలను అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) తీవ్రంగా వ్యతిరేకించింది.

- బెంగళూరు ఏఐపీఈఎఫ్ మహాసభల్లో కీలక తీర్మానం
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్ (సవరణ) బిల్లు-2025తో పాటు దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యుత్ రంగ ప్రైవేటీకరణ చర్యలను అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య (ఏఐపీఈఎఫ్) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు శుక్రవారం బెంగళూరులో ఏఐపీఈఎఫ్ చైర్మన్ శైలేంద్ర దూబే అధ్యక్షతన జరిగిన సమాఖ్య ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పలు కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా భారీ నిరసనలు చేపడతామని సమాఖ్య హెచ్చరించింది. ఒకే ప్రాంతంలో బహుళ పంపిణీ లైసెన్సులను అనుమతించడం వల్ల ప్రైవేట్ సంస్థలు కేవలం లాభదాయకమైన వినియోగదారులనే (చెర్రీ పికింగ్) ఎంచుకుంటాయని మండిపడింది. దీనివల్ల ప్రభుత్వ డిస్కంలు నష్టపోయి, క్రాస్ సబ్సిడీ వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా సాధారణ వినియోగదారులు, రైతులపై విద్యుత్ ఛార్జీల భారం విపరీతంగా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
వ్యవసాయ డిస్కంలు, సమాంతర లైసెన్సుల ఏర్పాటు వద్దు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యవసాయ డిస్కంల ఏర్పాటు ప్రతిపాదనను ఏఐపీఈఎఫ్ తోసిపుచ్చింది. వ్యవసాయాన్ని వేరు చేయడం ఆర్థికంగా, సాంకేతికంగా సమర్థనీయం కాదని, ఇది చివరకు ప్రైవేటీకరణకే దారి తీస్తుందని స్పష్టం చేసింది. అలాగే కర్ణాటకలోని 19 జిల్లాల్లో టాటా పవర్, హర్యానాలో ఎలెవన్ పవర్ లిమిటెడ్ వంటి ప్రైవేట్ సంస్థలకు సమాంతర పంపిణీ లైసెన్సులు ఇవ్వాలనే ప్రయత్నాలను, ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇవ్వాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతమైన లడాఖ్ పవర్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ను కార్పొరేటీకరణ చేయవద్దని డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లకు పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) తక్షణమే పునరుద్ధరించాలని సమావేశం డిమాండ్ చేసింది. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే విద్యుత్ సిబ్బందికి పెన్షన్ అనేది సామాజిక భద్రతా హక్కు అని పేర్కొంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఇంజనీర్ల ప్రతినిధులు, తెలంగాణ నుంచి సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి పి. రత్నాకర్ రావుతో పాటు జె.ఎల్. జనప్రియ, పి. సదానందం, ఎం. వెంకటేశ్వర్లు, విద్యాసాగర్, శ్రీనివాస్ రెడ్డి, సురేష్, శ్రీనాథ్ రెడ్డి, సతీష్ రెడ్డి, మల్లయ్య, రాజేశ్వరరావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.






