- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యుద్ధం ఎఫెక్ట్.. సామాన్యుడిపై ధరల భారం!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం భిక్కనూరు సామాన్యులపై పడింది. ముడిచమురు ధరల పెరుగుదల వల్ల నిర్మాణ సామాగ్రి, నిత్యావసరాలు మరియు గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు.

దిశ, భిక్కనూరు : ఇరాన్ vs ఇజ్రాయెల్ అమెరికాల మధ్య గత 23 రోజులుగా జరుగుతున్న యుద్ధం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలోని పేద, సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో, ఇక్కడ అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతం ఆకాశాన్ని తాకాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలను చూసి జనం షాక్‌కు గురవుతున్నారు. యుద్ధం ఎక్కడో జరుగుతుంటే, మన దగ్గర ధరలు పెరగడమేమిటని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ పథకం కింద ఇల్లు కట్టుకుంటున్న వారికి ఈ ధరల పెరుగుదల పెద్ద శనిలా దాపురించింది. గృహ నిర్మాణానికి అవసరమయ్యే పైపులు, ఇనుము, ఇతర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
నిర్మాణ సామాగ్రి, నిత్యావసరాల మంట
మొన్నటి వరకు రూ. 420 పలికిన బ్రాండెడ్ కంపెనీ చారించు పైపు ధర, కేవలం నాలుగైదు రోజుల్లోనే రూ. 620 దాటింది. ఇనుము ధరలు కూడా విపరీతంగా పెరగడం తో ఇల్లు ఎలా పూర్తి చేయాలో అర్థం కావడం లేదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు, ప్లాస్టిక్ తో తయారయ్యే ప్రతి వస్తువు ధర పెరగడం మరింత భారంగా మారింది. ప్లాస్టిక్ వస్తువులే కాకుండా, అల్యూమినియం, కాపర్ తో తయారయ్యే వస్తువుల ధరలు కూడా 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మున్ముందు కుటుంబాన్ని ఎలా పోషించాలోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కట్టెల ధరలకు రెక్కలు.. గ్యాస్ కష్టాలు మొదలు
నిన్న మొన్నటి వరకు తక్కువ ధరకే దొరికిన కట్టెలకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ట్రాలీ ఆటోలో వచ్చే చిన్న కట్టె మొద్దుల ధర రూ. 1200-1400 నుంచి ఏకంగా రూ. 2500-3000 వరకు పెరిగింది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతుండటంతో, ప్రజలు కట్టెల పొయ్యి వైపు మొగ్గుతున్నారు. దీంతో కట్టెల ధరలు కూడా పైకి ఎగబాకాయి. యుద్ధం ముదిరితే గ్యాస్ దొరకడం మరింత కష్టమవుతుందనే భయంతో, చాలామంది ముందు జాగ్రత్తగా కట్టెలపై వంట చేయడం మొదలుపెట్టారు.
అటవీ ప్రాంతాలకు వెళ్లి కట్టెలు తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో నిరుపేదలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సిలిండర్ ను పొదుపుగా వాడుతూ, ప్రత్యామ్నాయాల కోసం ఆలోచిస్తున్నారు. బ్లాక్ లో డొమెస్టిక్ సిలిండర్ రూ. 2 వేలు పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది. ఏజెన్సీలు 45 రోజుల తర్వాతే సిలిండర్ ఇస్తామనే నిబంధన పెట్టడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. కట్టెల పొయ్యి పెట్టే స్థలం లేని వారు ఎలక్ట్రిక్ స్టవ్ ల వైపు మళ్లుతున్నారు.






