అనంతగిరిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూపులు

by Jakkula.Mamatha |

అనంతగిరి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వేలాది మంది అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అనంతగిరిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూపులు
X

దిశ, అనంతగిరి: అనంతగిరి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వేలాది మంది అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మండలంలోని మొత్తం 20 గ్రామ పంచాయతీలకు ఇళ్ల మంజూరు ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. ప్రస్తుతం లకారం గ్రామంలో మాత్రమే పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగతా గ్రామపంచాయతీల్లో ఇళ్ల మంజూరు, నిర్మాణ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీల వారీగా అర్హుల జాబితాలను ఖరారు చేసి విడతల వారీగా ఇళ్ల నిర్మాణం చేపడతామని అధికార పార్టీ నాయకులు పలుమార్లు ప్రకటించారు. అయితే నేటి వరకు ఆ జాబితాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడంతో అర్హులు నిరీక్షణలోనే ఉన్నారు. గ్రామాల్లో సర్వేలు పూర్తయినప్పటికీ తుది జాబితాలు ప్రకటించకపోవడం పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా మండలంలోని పలు గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన రెండు, మూడు వర్గాలు ఉండటంతో ఒక్కో వర్గం నుంచి వేర్వేరుగా అర్హుల జాబితాలు ఎమ్మెల్యే వద్దకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏ జాబితాను పరిగణనలోకి తీసుకోవాలనే అంశంపై గందరగోళం నెలకొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల నాయకులు కలిసి ఒకే జాబితాను సిద్ధం చేసి పంపించాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. జాబితాల ఖరారులో జాప్యం కారణంగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రభుత్వం త్వరగా తుది అర్హుల జాబితాను ప్రకటించి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రస్తుతం మండలంలోని మిగిలిన 19 గ్రామ పంచాయతీల ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story