'గోమూత్రం తాగించారు.. శారీరకంగా కలిస్తే చనిపోతానన్నాడు': మాజీ ఎంపీ కుటుంబంపై కోడలి సంచలన ఆరోపణలు!

by Prasad Jukanti |   (  Updated:2026-07-12 08:28:21  IST  )

బలవంతంగా గోమూత్రం తాగించడంతో పాటు చేతబడులు చేయించారని కోడలి ఫిర్యాదుతో మాజీ ఎంపీ కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గోమూత్రం తాగించారు.. శారీరకంగా కలిస్తే చనిపోతానన్నాడు: మాజీ ఎంపీ కుటుంబంపై కోడలి సంచలన ఆరోపణలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన ఇంటి వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. తన చేత బలవంతంగా గో మూత్రం తాగించారని కోడలు గిరిజా రౌత్ చేసిన ఫిర్యాదుతో మహారాష్ట్రలోని థానేకు చెందిన మాజీ ఎంపీ వినాయక్ రౌత్, ఆయన భార్య, ఆయన కుమారుడు, కౌన్సిలర్ గితేశ్ రౌత్‍లపై మహారాష్ట్ర పోలీసులు 'అనాచార నిర్మూలన, చేతబడి నిరోధక చట్టం' (యాంటీ-సూపర్‌స్టిషన్ లా) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఫిరోజ్, ఖాజీ అనే ఇద్దరు తాంత్రికుల పేర్లను కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

క్షుద్రపూజలు, భౌతిక దాడులు:

తన ఫిర్యాదులో గిరిజా రౌత్ తన అత్త మామలతో పాటు భర్తపై ఆరోపణలు చేశారు. తన భర్త కుటుంబ సభ్యులు తనను బలవంతంగా గోమూత్రం తాగించడంతో పాటు క్షుద్రపూజలు చేశారని ఇందుకోసం తన తల వెంట్రుకలు పీకేశారని ఆరోపించారు. తనను మానసికంగా వేధించడమే కాకుండా, శారీరకంగా దాడి చేశారని, పలుమార్లు తనకు భోజనం పెట్టకుండా ఆకలితో అలమటించేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

హనీమూన్ వేధింపులు:

పెళ్లయిన కొత్తలో ఊటీకి హనీమూన్‌కు వెళ్లినప్పుడు తన భర్త గితేశ్ తనతో శారీరక బంధానికి నిరాకరించాడని ఆమె పేర్కొన్నారు. తాను దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నించినప్పుడల్లా తనను దూరం నెట్టేవాడని, భారతదేశంలో తాను కలవలేనని కేవలం విదేశాల్లో మాత్రమే శారీరక బంధం పెట్టుకుంటానని చెప్పినట్లు ఆమె ఆరోపించారు. ఊటీ నుండి తిరిగి వచ్చిన తర్వాత, తమ స్వగ్రామమైన తల్గావ్‌లో జరిగిన రిసెప్షన్‌కు వెళ్తుండగా, తాను నెమ్మదిగా నడుస్తున్నాననే నెపంతో భర్త అందరి ముందూ గట్టిగా అరిచి అవమానించాడని తెలిపారు. సమయం, సందర్భం లేకుండా తన కోపం తగ్గే వరకు గొడవపడటం అతనికి అలవాటని, ఈ విషయాలన్నీ ముంబై ఇంట్లో ఉన్న తన అత్తగారికి కూడా తెలుసని గిరిజా రౌత్ పేర్కొన్నారు.

శారీరకంగా కలిస్తే చచ్చిపోతానని:

2018లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కూడా భర్త తనను దూరం పెట్టాడని గిరిజా రౌత్ ఆరోపించారు. దీనిపై తాను ప్రశ్నించగా తనపై దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తామిద్దరం శారీరకంగా కలిస్తే తాను చనిపోతానంటూ భర్త తనను భయపెట్టాడని గిరిజ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వినాయక్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత ఆప్తుడిగా పేరుంది. ఈ తీవ్రమైన ఆరోపణలపై వినాయక్ రౌత్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పోలీసులు ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఆరోపణలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‍గా మారాయి.

కోడలి ఆరోపణలను తిప్పికొట్టిన మాజీ ఎంపీ:

కోడలి ఆరోపణలను మామ వినాయక్ రౌత్ ఖండించారు. తమపై వచ్చిన ఆరోపణలపై తాజాగా స్పందించిన ఆయన.. డబ్బుల కోసమే ఆమె ఇలాంటి ప్లాన్ వేసిందన్నారు. తమ కుటుంబానికి ఎలాంటి తాంత్రికులతో సంబంధం లేదని స్పష్టం చేశారు. పెళ్లయిన తర్వాత గత మూడేళ్లుగా కొడుకు, కోడలు కలిసి ఉండటం లేదని ఆమె ఒంటరిగానే నివసిస్తోందని ఆయన తెలిపారు. ఈ కేసు వెనుక భారీ వసూళ్ల ప్లాన్ ఉందని ఆరోపించారు. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇప్పటికే పలు విడతలుగా చర్చలు జరిగాయన్నారు. మూడు నెలల క్రితం గిరిజా గృహహింస కేసు పెట్టినప్పుడు రాజీ కోసం మాట్లాడామని అప్పుడు ఆమె రూ.5 కోట్ల నగదు, 3 బెడ్‌రూమ్‌ల ఇల్లు, ఒక ఆటోమేటిక్ లగ్జరీ కారుతో పాటు నెలకు రూ.2 లక్షల భరణం డిమాండ్ చేసింది. మేము ఆ గొంతెమ్మ కోర్కెలను తిరస్కరించామన్నారు. రెండోసారి ఈసారి ఏకంగా రూ. 12 కోట్ల నగదు, నెలకు రూ. 5 లక్షల ఖర్చులు, ఇల్లు, కారు కావాలని డిమాండ్ చేసిందని చెప్పారు. ఆమె డిమాండ్లను మేము అంగీకరించకపోవడం వల్లే ఈ రకమైన ఆరోపణలు చేస్తోందని అన్నారు.

Next Story