ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ!

by Jakkula.Mamatha |

మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ సిబ్బంది తీరుతో అబాసు పాలవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆర్టీసీ బస్సుల కోసం గంటల తరబడి ప్రయాణికుల నిరీక్షణ!
X

దిశ, కొణిజర్ల: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీ సిబ్బంది తీరుతో అబాసు పాలవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవర్లు కండక్టర్లకు మహాలక్ష్మి పథకం అంటే చులకనగా మారిందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. మహిళ ఆర్థికాభివృద్ధికి ఆసరాగా నిలవాలనే ప్రభుత్వ లక్ష్యం నీరు కారిపోతుంది. వైరా మున్సిపాలిటీలో భాగమైన పల్లిపాడు గ్రామంలో ఎక్స్ ప్రెస్ బస్టాప్ ఉన్నా బస్సులు ఆగడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

దీంతో పల్లిపాడులో ఎక్స్ ప్రెస్ బస్టాప్ ఉన్న ప్రయోజనం లేకుండా పోతుంది. ఇక్కడి నుంచి ఖమ్మం వెళ్లాలంటే ఎక్స్ ప్రెస్ బస్సులు ఆగే పరిస్థితి లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లిపాడు బస్టాండ్ ప్రయాణికులతో ఉదయం సాయంత్రం వేళలో నిత్యం రద్దీగా ఉంటుంది. చుట్టుపక్కల 15 గ్రామాల నుంచి ప్రజలు ఖమ్మం వెళ్లాలంటే పల్లిపాడు సెంటర్ కు వచ్చి బస్సు ఎక్కాల్సి ఉంటుంది. అంజనాపురం గుబ్బగుర్తి పెద రామాపురం లక్ష్మీపురం మెకాల కుంట సింగరాయపాలెం సాలె బంజర తీగల బంజర సిద్ధికి నగర్ లాలాపురం తదితర గ్రామాలను ప్రజలు ఖమ్మం వెళ్లేందుకు పల్లిపాడు సెంటరుకు వచ్చి బస్సు ఎక్కాల్సిందే.

ప్రయాణికులు వస్తుండటంతో బస్టాండ్ సెంటర్ నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఫ్రెండ్స్ యూత్ స్వచ్ఛంద సంస్థ అభ్యర్థన మేరకు 2022 సంవత్సరంలో అప్పటి స్థానిక శాసన సభ్యులు ప్రస్తుత మాజీ శాసన సభ్యులు రాములు నాయక్ చొరవ తీసుకుని అప్పటి రవాణా శాఖ మంత్రి ప్రస్తుత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి పరిస్థితిని వివరించడంతో స్పందించిన మంత్రి పల్లిపాడులో ఎక్స్ ప్రెస్ బస్సులు ఆపేందుకు అధికారులకు ఆదేశాలు లిచ్చారు. అప్పటి నుంచి అన్ని డిపోల ఎక్స్ ప్రెస్ బస్సులను ఆపి ప్రయాణీకులను ఎక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది.

మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చిరు వ్యాపారాలు, చిరు ఉద్యోగాలు చేసుకునే మహిళలు పేద మహిళలు ఉచిత ప్రయాణం కావటంతో బస్సుల పైన ఆధారపడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని నూరు శాతం అమలు చేయాల్సిన టువంటి ఆర్టీసీ సిబ్బంది మహిళా ప్రయాణీకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బస్టాప్ ఉన్నా కండక్టర్లు పల్లిపాడు బస్సు ఆగదంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మధిర డిపో బస్సు తప్ప మిగతా డిపోల బస్సులు ఇక్కడ ఆగే పరిస్థితి లేదు. ఆర్టీసీ అధికారుల ఆదేశాలనే డ్రైవర్లు కండక్టర్లు ధిక్కరిస్తున్నారు.

ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ప్రయాణికులు చెయ్యెత్తినా లెక్కచేయకుండా వెళ్ళిపోతున్నారు. దీంతో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఖమ్మం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కు బస్సులో ఆగడం లేదని ఫిర్యాదు చేస్తే రెండు రోజులు ఆపుతున్నారు తర్వాత పరిస్థితి యధా స్థితికి చేరుకుంటుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి పల్లిపాడులో అన్ని ఎక్స్ ప్రెస్ సర్వీస్ లు నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం ఆర్ఎం బస్సులు ఆపకపోవడంపై ఆర్టీసీ ఖమ్మం ఆర్ఎంను వివరణ కోరగా పల్లిపాడులో స్టాప్ ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Next Story