ఆటల్లేని బడులు.. అర్హత లేని టీచర్లు!

by Ratna Kumari |

మండల కేంద్రంలోని ప్రైవేట్ విద్యా వ్యవస్థ పూర్తిగా వ్యాపారమయమైంది.

ఆటల్లేని బడులు.. అర్హత లేని టీచర్లు!
X

దిశ, బిజినేపల్లి : మండల కేంద్రంలోని ప్రైవేట్ విద్యా వ్యవస్థ పూర్తిగా వ్యాపారమయమైంది. ఒకవైపు అడ్మిషన్, ట్యూషన్, హాస్టల్ ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి యాజమాన్యాలు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి. కానీ, విద్యా నాణ్యత, విద్యార్థుల కనీస సౌకర్యాల విషయంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాయి. ముఖ్యంగా మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలల్లో అర్హతలు లేని ఉపాధ్యాయులతోనే విద్య బోధన కొనసాగుతోందని, ఇది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాల దోపిడీ పర్వం సాగుతున్నా, విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఫీజులు దండిగా.. సదుపాయాలు సున్నా..

మండల కేంద్రంలో సుమారు 13 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలలకు ఆటస్థలాలు, సరైన మరుగుదొడ్లు, విశాలమైన తరగతి గదులు, వెంటిలేషన్ వంటి కనీస మౌలిక సదుపాయాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలన్నా, చాలా స్కూళ్లు ఇరుకైన భవనాల్లోనే నడుస్తున్నాయి. దీంతో విద్యార్థులు రోజంతా తరగతి గదుల్లోనే మగ్గిపోవాల్సి వస్తోంది. శారీరక వ్యాయామం, క్రీడలకు అవకాశం లేకపోవడం వల్ల వారి ఆరోగ్యం, మానసిక వికాసం దెబ్బతింటున్నాయి. ఫిట్నెస్ పర్మిట్ లేని బస్సులతో విద్యార్థులను తరలించడం, అనుభవం లేని డ్రైవర్లతో బస్సులను నడపడం వల్ల మండల కేంద్రంలో ఎన్నో యాక్సిడెంట్లు అయిన సంఘటనలు ఉన్నాయి. ప్రతి స్కూల్ బస్సులో హెల్పర్ ఉండాల్సి ఉన్న ఏ స్కూల్ బస్సులో హెల్పర్ లేకపోవడంతో విద్యార్థులు బస్సు ఎక్కి, దిగుతుండడంతో ఎన్నోసార్లు కింద పడిన సంఘటనలు మరెన్నో ఉన్నాయని, పేరెంట్స్ కమిటీలు కూడా నామ మాత్రంగానే ఉన్నాయి.

తక్కువ జీతాలకే ఎక్కువ ప్రాధాన్యం...

ప్రైవేట్ పాఠశాలలు విద్యా ప్రమాణాలను గాలికొదిలేశాయి. ముఖ్యంగా స్కూళ్లలో డిగ్రీ, బీఈడీ, పీజీ అర్హతలు కలిగిన ఉపాధ్యాయులను నియమించడం లేదు. తక్కువ వేతనాలకు పనిచేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. కొన్ని చోట్ల డిగ్రీ కూడా పూర్తి చేయని వారు. పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ చదివిన వారితోనే విద్యాబోధన చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు బోధించడానికి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/పీజీతోపాటు బీఈడీ/డీఈఎల్ ఈడీ అర్హతలు తప్పనిసరి. కానీ, ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు.

పట్టించుకోని జిల్లా విద్యాశాఖ...

ఉపాధ్యాయులకు కనీస వేతనాలు కూడా చెల్లించకుండా సరైన టైంలో ఇయ్యకుండా వేధిస్తూ అరకొర జీతాలతో ఎక్కువ పనిగంటలు చేయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో అర్హత కలిగిన వారు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఫిర్యాదు చేస్తే తమ పిల్లలను యాజమాన్యాలు లక్ష్యంగా చేసుకుంటాయనే భయంతో చాలామంది తల్లిదండ్రులు బయటకు రావడం లేదు. కానీ, మండలంలోని ప్రైవేట్ పాఠశాలల పరిస్థితులపై సంబంధిత అధికారులు సమగ్ర తనిఖీలు నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Next Story