పాడె మోసేందుకు ‘ఆ నలుగురు’ లేని సమాజం మనది !

by Sujitha Rachapalli |

ఒకప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే అది ఆ ఒక్క కుటుంబ దుఃఖం కాదు.. ఆ ప్రాంతమంతా కన్నీరు పెట్టుకునేది. ఇంటి ముందు పాడే సిద్ధమవుతుంటే భుజం ఇచ్చేందుకు ఎన్నో చేతులు ముందుకు వచ్చేవి.

పాడె మోసేందుకు ‘ఆ నలుగురు’ లేని సమాజం మనది !
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే అది ఆ ఒక్క కుటుంబ దుఃఖం కాదు.. ఆ ప్రాంతమంతా కన్నీరు పెట్టుకునేది. ఇంటి ముందు పాడే సిద్ధమవుతుంటే భుజం ఇచ్చేందుకు ఎన్నో చేతులు ముందుకు వచ్చేవి. ‘చావుకు నలుగురు’ అనేది మాట కాదు.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించేది. చివరి యాత్రలో ముందుకు నడిచే అడుగులు.. కన్నీటి మధ్యన ఆ కుటుంబం ఒంటరిగా లేదన్న ఓదార్పు నిచ్చేవి. కానీ ప్రస్తుత కాలంలో ఆఖరి మజిలీలో మానవీయత లేని దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాంకేతికత పెరిగింది.. సంబంధాలు తగ్గాయి. ఫోన్‌లో సంతాపం చెప్పే రోజులొచ్చాయి. శ్మశానానికి వెళ్లే సమయం లేదనే కారణాలు పెరిగాయి. కానీ మృతుడి కుటుంబానికి ఆ నలుగురు ఇచ్చే ఓదార్పు.. ఆ చివరి నడకలో కనిపించే మనుష్యత్వం.. ఎలాంటి మాటలకూ అందని ధైర్యం.

పాడె మోసే వారే కరువు

నేటి సమాజంలో కాలం చెల్లిన వారి పాడె మోసే నలుగురు కూడా దొరకని పరిస్థితులు కొన్ని చోట్ల కనిపించడం మానవ సంబంధాల బలహీనతకు అద్దం పడుతుంది. ఒకప్పుడు పాడె భుజాన వేసుకోవడం అంటే ఆ మనిషి పట్ల మనం చూపించే చివరి బాధ్యత అన్న భావన ఉండేది. ఎండైనా, వానైనా, బురదైనా కిలో మీటర్ల దూరం మృతుడి చివరి ప్రయాణంలో ముందు ఉండేవారు. దాన్ని బాధ్యతగా మాత్రమే కాకుండా చనిపోయిన వారు బతికిన జీవితానికి ఇచ్చే గౌరవంగా భావించేవారు. కానీ నేటి సమాజంలో కొన్నిచోట్ల కనిపిస్తున్న దృశ్యాలు మనస్సును కలిచివేస్తున్నాయి. మృతదేహాలను మోసేందుకు భుజాలు లేక వాహనంపై తీసుకెళ్లాల్సి రావడం బాధాకరంగా కనిపిస్తోంది.

ఆఖరి దారిలో ఒంటరి అడుగులు

ఇక మనిషి చివరి ప్రయాణంలో కూడా నడిచే అడుగులు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు మృతదేహం ముందు చివరి గౌరవంగా డప్పులు కొట్టేవారు నడిచేవారు. శవంపై పూలు జల్లుతూ బంధుత్వాన్ని గుర్తుచేసే ఆచారాలు పాటించేవారు. కానీ ఇప్పుడు వైకుంఠ రథాలలో మృతుల కుటుంబ సభ్యులు, సొంత వాహనాల్లో వారి బంధువులు శ్మశాన వాటికకు వెళ్తున్నారు. ముఖ్యంగా తల కొరివి పెట్టే వారితో సహా డప్పులు కొట్టేవారు సైతం వైకుంఠ రథంలోనే వెళ్లే దుర్భరమైన దృశ్యాలను చూసే పరిస్థితులు నెలకొంటున్నాయి. వాహనంలో కూర్చున్న వాళ్ళలో ఎంత బాధ ఉన్నా మనిషి మనిషికి ఇంత దూరమైపోతున్నాడా అన్న ప్రశ్న ముంచెత్తుతోంది.

మసకబారుతున్న మానవ సంబంధాలు

జీవితమంతా మనుషుల మధ్య గడిపిన వ్యక్తి.. చివరి ప్రయాణంలో మాత్రం కొద్దిమందితోనే సాగిపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. వలసలు, ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం, చిన్న కుటుంబాల జీవనం, పనుల ఒత్తిడి, మారుతున్న జీవనశైలి ఇవన్నీ కారణాలే కావచ్చు. కానీ కారణాలు ఎన్ని ఉన్నా.. బాధలో ఉన్న కుటుంబానికి భుజం ఇవ్వడం, మృతుడి చివరి యాత్రలో నడవడం అనే మానవీయత తగ్గిపోవడం మాత్రం సమాజం ఆలోచించాల్సిన అంశమే.

ఒకప్పుడు ఊరిలో ఎవరు చనిపోయినా ‘ఎవరి ఇంటివాడు?’ అని కాదు.. ‘మన ఊరివాడు’ అనే భావన ఉండేది. ఇప్పుడు ‘మన పని’, ‘మన సమయం’, ‘మన ప్రయాణం’ అనే పరిమితుల్లో బంధాలు కూడా ఇరుక్కుపోయి మానవ సంబంధాలు మసకబారుతున్నాయా అన్న ఆవేదన కలుగుతోంది. బతికున్నప్పుడు పలకరించలేకపోయినా.. కనీసం చివరి చూపుకు వెళ్లడం, చివరి యాత్రలో కొన్ని అడుగులు నడవడం, బాధలో ఉన్న కుటుంబానికి భరోసా ఇవ్వడం.. ఇవి పెద్ద సహాయాలు కాకపోయినా మనిషిగా గొప్ప మానవీయత. చివరికి మనిషి సంపాదించేది డబ్బు కాదు.. అతని వెనకాల నడిచే మనుషులే. ఒకప్పుడు ఆ నలుగురు ఉండేవారు. ఇప్పుడు ఆ నలుగురే దూరమవుతుంటే.. అది కేవలం ఒక అంతిమయాత్రలో మార్పు కాదు.. మన సమాజంలో జరుగుతున్న నిశ్శబ్ద మార్పు. ‘చావుకు నలుగురు’ అనేది సామెత మాత్రమే కాదు.. మనిషి జీవితానికి సమాజం ఇచ్చే చివరి గౌరవం. ఆ నలుగురు దూరమవుతుంటే.. పాడెమోసే భుజాలు కరువవుతుంటే.. మృతదేహం ముందు నడిచే అడుగులు కూడా వాహనాల్లోనే మిగిలిపోతుంటే.. మన బంధాలు, మన మానవత్వం ఏ దిశగా వెళ్తున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

- నవీన్, దిశ రిపోర్టర్, సిరిసిల్ల

Next Story