TG20 లీగ్ ఛాంపియన్ ఈ - హైదరాబాద్

by Muthe.Rajitha |

టీజీ20 లీగ్‌ ఉత్కంఠభరితమైన ఫైనల్‌ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌పై హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు ఘన విజయం సాధించి, టోర్నమెంట్‌ విజేతగా అవతరించింది.

TG20 లీగ్ ఛాంపియన్ ఈ - హైదరాబాద్
X

దిశ, వెబ్ డెస్క్ : టీజీ20 లీగ్‌ ఉత్కంఠభరితమైన ఫైనల్‌ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌పై హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు ఘన విజయం సాధించి, టోర్నమెంట్‌ విజేతగా అవతరించింది. ఖమ్మం వేదికగా జరిగిన ఈ ఫైనల్ పోరులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఖమ్మం ఏసెస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఖమ్మం జట్టులో మికిల్‌ జైస్వాల్‌ 65 పరుగులతో అద్భుతమైన అర్ధసెంచరీ చేసి జట్టుకు భారీ స్కోరు అందించే ప్రయత్నం చేశాడు. అతనికి తోడుగా హిమతేజ 31 పరుగులు, విద్యానంద రెడ్డి 20 పరుగులు (నాటౌట్), ప్రతీక్‌ రెడ్డి 15 పరుగులు చేసి రాణించారు. అయితే హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఖమ్మం జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. హైదరాబాద్‌ బౌలర్లలో యశ్వీర్‌ గౌడ్‌ అత్యుత్తమంగా రాణించి 3 వికెట్లు పడగొట్టగా, దేవ్‌ మెహతా, అజయ్‌ గౌడ్‌ చెరో 2 వికెట్లు, అఖిల్‌ రాథోడ్‌ ఒక వికెట్‌ తీసి ఖమ్మం రన్‌రేట్‌ను నియంత్రించారు.

అనంతరం 158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ జట్టు కేవలం 17.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌ అభిరథ్‌రెడ్డి 48 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మరోసారి జట్టును ముందుండి నడిపించాడు. ఆ తర్వాత షణ్ముఖ అశ్విన్‌ 36 పరుగులతో రాణించగా, చివర్లో వైష్ణవ్‌రెడ్డి 41 పరుగులు, ప్రణవ్‌ వర్మ 19 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు. వీరిద్దరూ అద్భుతమైన భాగస్వామ్యంతో మ్యాచ్‌ను మరో 14 బంతులు మిగిలి ఉండగానే ముగించారు. ఖమ్మం బౌలర్లలో హర్షిత్‌ సాయి, విద్యానందరెడ్డి, వేద్‌రెడ్డి, షేక్‌ అజర్‌ తలో వికెట్‌ తీసినప్పటికీ, హైదరాబాద్ బ్యాటర్లను అడ్డుకోవడంలో వారు విఫలమయ్యారు. దీనితో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ లీగ్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

Next Story