ఐఫోన్ 17 ధర ఆకాశానికి.. అయినా ఔట్ ఆఫ్ స్టాక్!

by Muthe.Rajitha |

రాబోయే కొత్త మోడల్‌ మార్కెట్లోకి రావడానికి ఇంకా కొన్ని వారాల సమయం ఉందనగానే, ఐఫోన్‌ 17 మోడళ్లకు మార్కెట్లో ఒక్కసారిగా ఊహించని డిమాండ్‌ ఏర్పడింది.

ఐఫోన్ 17 ధర ఆకాశానికి.. అయినా ఔట్ ఆఫ్ స్టాక్!
X

దిశ, వెబ్ డెస్క్ : యాపిల్‌ సంస్థ ఏటా కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు, దానికి ముందున్న పాత మోడళ్ల ధరలు తగ్గడం, వాటికి డిమాండ్‌ పెరగడం అనేది మొబైల్ మార్కెట్లో మనం ఎప్పుడూ చూసే సర్వసాధారణమైన విషయమే. కొత్త మోడల్ లాంచ్ సమయంలో దాని భారీ ధరను భరించలేని సగటు వినియోగదారులు, ధరలు తగ్గిన పాత మోడళ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రాబోయే కొత్త మోడల్‌ మార్కెట్లోకి రావడానికి ఇంకా కొన్ని వారాల సమయం ఉందనగానే, ఐఫోన్‌ 17 మోడళ్లకు మార్కెట్లో ఒక్కసారిగా ఊహించని డిమాండ్‌ ఏర్పడింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ ఈ-కామర్స్ సైట్లతో పాటు ఆఫ్‌లైన్‌ రీటైల్ స్టోర్లలోనూ ఐఫోన్‌ 17 మోడళ్లు దొరకడం అత్యంత గగనంగా మారింది. కొత్త సిరీస్ రాకముందే పాత మోడల్ కోసం వినియోగదారులు ఇలా ఎగబడటానికి భవిష్యత్తులో రానున్న భారీ ధరల పెంపు భయాలే ప్రధాన కారణమని టెక్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

యాపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌కుక్‌ ఇటీవల చేసిన ఒక ప్రకటనే ఈ అనూహ్య డిమాండ్‌కు కారణం. అంతర్జాతీయ మార్కెట్లో మెమొరీ చిప్‌ల ధరలు విపరీతంగా పెరగడం వల్ల, రానున్న రోజుల్లో యాపిల్‌ ఉత్పత్తుల ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే యాపిల్ సంస్థ తన ఐప్యాడ్స్‌, మ్యాక్స్‌, మ్యాక్‌బుక్స్‌ వంటి ఇతర గ్యాడ్జెట్ల ధరలను అమాంతం పెంచేసింది. అయితే, ఆ సమయంలో ఐఫోన్‌ల ధరలను మాత్రం ప్రస్తుతానికి యథాతథంగా ఉంచింది. దీంతో రానున్న రోజుల్లో ఐఫోన్‌ 17 సిరీస్ ధరలు కూడా ఎక్కడ భారీగా పెరిగిపోతాయోననే భయంతో వినియోగదారులు అప్రమత్తమయ్యారు. ధరలు పెరగకముందే ఫోన్‌ను సొంతం చేసుకోవాలనే ఆరాటంతో ఐఫోన్‌ 17 మోడళ్ల కొనుగోలుకు భారీగా ఆర్డర్లు పెడుతున్నారు. ఫలితంగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ప్రముఖ ఇ-కామర్స్‌ వేదికలతో పాటు నగరాల్లోని ప్రధాన ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ ఐఫోన్‌ 17 స్టాక్ అయిపోయి, 'ఔటాఫ్‌ స్టాక్‌' బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Next Story