మంత్రికే షాకిచ్చిన కండక్టర్.. 'చిల్లర లేకుంటే బస్సు దిగమని ఆగ్రహం'

by Muthe.Rajitha |

ప్రజా రవాణా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామని బస్సెక్కిన మంత్రికి కండక్టర్ భారీ షాక్ ఇచ్చాడు.

మంత్రికే షాకిచ్చిన కండక్టర్.. చిల్లర లేకుంటే బస్సు దిగమని ఆగ్రహం
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజా రవాణా ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామని బస్సెక్కిన మంత్రికి కండక్టర్ భారీ షాక్ ఇచ్చాడు. చిల్లర లేకుంటే బస్సు దిగిపోమని హుకుం జారీ చేసాడు. కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌ బెంగళూరు నగరంలో ఆర్టీసీ బస్సు సేవలపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీ తీవ్ర కలకలం రేపింది. ప్రజలకు అందుతున్న రవాణా సేవలను స్వయంగా పరిశీలించేందుకు ముఖానికి మాస్క్‌ ధరించి, ఒక సాధారణ ప్రయాణికుడిలా నగరంలోని పలు రూట్లలో బస్సు ప్రయాణం చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను, ఆర్టీసీ సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరును ఆయన స్వయంగా కళ్లారా చూశారు.

"చిల్లర లేకుంటే బస్ దిగు"

తనిఖీల్లో భాగంగా మంత్రి ఒక బస్సు ఎక్కి కండక్టర్‌కు వంద రూపాయల నోటు ఇచ్చి రెండు టికెట్లు ఇవ్వమని అడిగారు. అయితే ఆ కండక్టర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, తన వద్ద సరిపడా చిల్లర లేదంటూ ఖాళీ బ్యాగును చూపిస్తూ.. చిల్లర లేకపోతే బస్సు దిగిపోవాలంటూ సాక్షాత్తూ మంత్రిగారికే సలహా ఇచ్చాడు. అంతేకాదు ఒక బస్ స్టాప్ వద్ద ప్రయాణికుడు చేయి చూపి బస్సు ఆపమని కోరినప్పటికీ, డ్రైవర్ బస్సును ఆపకుండా నిర్లక్ష్యంగా ముందుకు పోనివ్వడాన్ని కూడా మంత్రి గమనించారు.

మంత్రి ఆగ్రహం

సాధారణ ప్రజల పట్ల ఆర్టీసీ సిబ్బంది విధుల్లో చూపిస్తున్న ఈ తీవ్ర నిర్లక్ష్యంపై రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడిన సదరు కండక్టర్‌ను, అలాగే స్టాప్‌లో బస్సు ఆపకుండా వెళ్లిన డ్రైవర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేయాలని ఆయన రవాణా శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. విధుల్లో అశ్రద్ధ వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ చర్య ద్వారా మంత్రి సిబ్బందికి గట్టి హెచ్చరిక పంపారు.

Next Story