ఓటరు కార్డు పొందిన ఇద్దరు పాకిస్థానీయులు అరెస్ట్

by Muthe.Rajitha |

తమ జాతీయతను దాచిపెట్టి, అక్రమ మార్గాల్లో భారతీయ రేషన్‌కార్డ్‌, ఓటర్‌ ఐడీ కార్డులను పొందిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఓటరు కార్డు పొందిన ఇద్దరు పాకిస్థానీయులు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తమ జాతీయతను దాచిపెట్టి, అక్రమ మార్గాల్లో భారతీయ రేషన్‌కార్డ్‌, ఓటర్‌ ఐడీ కార్డులను పొందిన ఒక పాకిస్థానీ మహిళను, ఆమె కుమారుడిని కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక తహసీల్దార్‌ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను సదరు తల్లీకుమారులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాగేపల్లి ప్రాంతానికి చెందిన మహ్మమద్‌ ఆయుబ్‌ ఖాన్‌ అనే వ్యక్తి గతంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) లో ఉద్యోగం చేస్తున్న సమయంలో, పాకిస్థాన్‌కు చెందిన ఫరా నాజ్‌ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

ఈ దంపతులకు నలుగురు సంతానం కలగగా, వారిలో మహ్మద్‌ ఫర్డీన్‌ అనే కుమారుడు పాకిస్థాన్‌లోనే జన్మించాడు. ఆ తర్వాత ఈ కుటుంబం మొత్తం భారతదేశానికి వచ్చి బాగేపల్లిలో నివాసం ఉంటుండగా, పాక్ జాతీయురాలైన ఖాన్‌ భార్య ఫరా నాజ్, పాకిస్థాన్‌లో పుట్టిన ఆమె కుమారుడు ఫర్డీన్‌ ఇద్దరూ తమ జాతీయత వివరాలను దాచిపెట్టి ఇక్కడి ప్రభుత్వ గుర్తింపు కార్డులను సంపాదించారు. ఇటీవల నిర్వహించిన అధికారిక సర్వే ప్రక్రియలో వీరి గుర్తింపు కార్డుల వ్యవహారం బయటపడింది.

ఈ అక్రమాలపై స్థానిక తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమగ్ర దర్యాప్తు ప్రారంభమైంది. ప్రభుత్వ రికార్డులను, వారి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించగా వారు తమ పాకిస్థాన్ జాతీయతను పూర్తిగా దాచిపెట్టి మోసపూరితంగా కార్డులు పొందినట్లు ఆధారాలతో సహా రుజువైంది. దీనిపై స్థానిక జిల్లా ఎస్పీ స్పందిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా పొందిన వారి ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను రికార్డుల నుండి తక్షణమే తొలగించామని స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గాను తల్లీకుమారులను అరెస్ట్‌ చేశామని, వీరికి స్థానికంగా ఎవరైనా సహకరించారా?, ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు ఏమిటనే కోణంలో విచారణ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

Next Story