ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల పనితీరుపై సర్కార్ ఫోకస్! ఆడిటింగ్, పర్యవేక్షణల కోసం కమిటీ ఏర్పాటు

by Ramesh Naini |

రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల పనితీరుపై సర్కార్ ఫోకస్! ఆడిటింగ్, పర్యవేక్షణల కోసం కమిటీ ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల పనితీరును ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేసింది. ఏజెన్సీలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఆడిట్ నిర్వహించడంతో పాటు, క్రమబద్ధమైన పర్యవేక్షణ (సిస్టమేటిక్ మానిటరింగ్) కోసం ఉన్నత స్థాయి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో..

ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో వేలాది మంది ఉద్యోగులు ఔట్‌సోర్సింగ్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఏజెన్సీలు కార్మిక చట్టాలను (ఈపీఎఫ్, ఈఎస్ఐ, లేబర్ లైసెన్స్, కనీస వేతనాలు) పక్కాగా అమలు చేస్తున్నాయా? లేదా? అన్నదానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులను కాపాడటం, ఏజెన్సీల కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం.. ఆడిట్ కోసం ఈ కమిటీకి బాధ్యతలు అప్పగించింది.

కమిటీ స్వరూపం ఇదే..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఉన్నత స్థాయి కమిటీకి చైర్మన్‌తో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను సభ్యులుగా నియమించింది.

చైర్మన్: అహ్మద్ నదీమ్ (జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ)

కన్వీనర్: గౌరవ్ ఉప్పల్ (ఫైనాన్స్, ప్లానింగ్ సెక్రటరీ)

సభ్యులు: డి. హరిచందన (కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శి), నాగేశ్వరరావు (ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ), ద్రాక్షమణి (డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్). వీరితో పాటు జీఏడీ నుంచి మరొకరిని నామినేట్ చేసుకునే అవకాశం కల్పించారు.

కమిటీ కీలక విధులు

ఈ కమిటీ 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. కమిటీ ప్రధానంగా ఈ కింది అంశాలపై విచారణ జరుపుతుంది. రాష్ట్రంలోని అన్ని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలపై సమగ్ర ఆడిట్ నిర్వహించడం. ఈపీఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్, కనీస వేతనాల చట్టం, కాంట్రాక్ట్ లేబర్ చట్టాల అమలు తీరును పరిశీలించడం. ఉద్యోగులకు జీతాలు డీబీటీ (DBT) ద్వారా బ్యాంకు ఖాతాల్లో సకాలంలో జమవుతున్నాయో లేదో నిర్ధారించడం. హాజరు, వేతన రిజిస్టర్లతో పాటు ఇతర చట్టబద్ధమైన రికార్డుల తనిఖీ. ఏజెన్సీల వాస్తవ కార్యకలాపాలను ధృవీకరించడం, ప్రభుత్వ శాఖలతో కుదుర్చుకున్న ఒప్పందాల అమలును పరిశీలించడం. ఉద్యోగుల సంక్షేమానికి విఘాతం కలిగించే లోపాలు, అక్రమాలను గుర్తించి.. పారదర్శకత పెంచేందుకు అవసరమైన సూచనలు ఇవ్వడం. భవిష్యత్తులో ఔట్‌సోర్సింగ్ నియామకాలకు మార్గదర్శకాలు రూపొందించడం, వేతనాలు, సేవా నిబంధనలను సమీక్షించడం.

పారదర్శకత కోసం ‘ఐఎఫ్‌ఎంఐఎస్’

ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కేంద్రీకృత పర్యవేక్షణ కోసం ‘ఐఎఫ్ఎంఐఎస్’ (IFMIS) పోర్టల్‌లో ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటు చేసే సాధ్యసాధ్యాలను కమిటీ పరిశీలించనుంది. ఇందులో ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీల వివరాలు, ఉద్యోగుల సంఖ్య, ఆధార్ ధృవీకరణ, ఈపీఎఫ్, ఈఎస్ఐ, జీతాలు చెల్లించిన విధానం, సమయపాలన తదితర పూర్తి వివరాలను పొందుపరచనున్నారు. కమిటీ చేపట్టే ఆడిటింగ్ ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని అన్ని ప్రభుత్వ శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. విచారణకు అవసరమైన రికార్డులు, సమాచారాన్ని సకాలంలో అందించేందుకు వీలుగా ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Next Story