తెలంగాణకు 'రక్తకన్నీరు-2' చూపిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బండి సంజయ్

by Ramesh Naini |

‘తెలంగాణ ప్రజలకు రెండు పార్టీల నేతలు రక్తకన్నీరు సినిమా చూపిస్తున్నారు. కాంగ్రెస్ డైరెక్షన్..బీఆర్ఎస్ యాక్షన్ మూవీ రక్తకన్నీరు-2 ను తలపిస్తోంది. ‘రక్త కన్నీరు’ నాగభూషణంను మించి నటనలో జీవిస్తున్నారు’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు.

తెలంగాణకు రక్తకన్నీరు-2 చూపిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘తెలంగాణ ప్రజలకు రెండు పార్టీల నేతలు రక్తకన్నీరు సినిమా చూపిస్తున్నారు. కాంగ్రెస్ డైరెక్షన్..బీఆర్ఎస్ యాక్షన్ మూవీ రక్తకన్నీరు-2 ను తలపిస్తోంది. ‘రక్త కన్నీరు’ నాగభూషణంను మించి నటనలో జీవిస్తున్నారు’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ కాళేశ్వరాన్ని కూల్చి రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్ల పాల్జేసిందన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరాన్ని కోమాలోకి నెట్టిందన్నారు. ఈ రెండు పార్టీల పాపాలకు తెలంగాణ రైతులే బలవుతున్నారని, కాంగ్రెస్ చేతకానితనాన్ని ఎన్డీఎస్ఏపై నెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ఇకనైనా మానుకోవాలని హితవుపలికారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం...బ్యారేజీల యజమాని తెలంగాణ ప్రభుత్వమేనని తెలిపారు. ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ కమిటీలు సలహాలు మాత్రమే ఇస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బ్యారేజీ మరమ్మతు పనులు చేయాల్సింది.. బాధ్యత వహించాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు.

కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇప్పటికే నివేదిక

కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ ఇప్పటికే 3 సార్లు నివేదిక ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని పదే పదే చెప్పినా ఎందుకు పెడచెవిన పెడుతున్నారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కార్ చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం అలవాటుగా మారిందన్నారు. ‘కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, బాధ్యులను జైల్లో వేస్తామని గతంలో ప్రకటించింది కాంగ్రెస్సే. అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ జరపకుండా రూ.9 వేల కోట్ల అవినీతిపై విచారణకే పరిమితమైంది నిజం కాదా? ఆ కేసులో సూత్రధారులను అరెస్ట్ చేసి జైల్లో వేయకుండా సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కేంద్రంపై రుద్ది తప్పుకున్నది నిజం కాదా? కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అసలు విజిలెన్స్ నివేదికను బయట పెట్టే దమ్ముందా? బీఆర్ఎస్ పాపాలను రేవంత్ రెడ్డి మోయడం వెనుక మతలబు ఏమిటి? తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. అని నిలదీశారు.

రెండున్నరేళ్లు జాప్యం చేసింది మీరు కదా?

కాళేశ్వరం మరమ్మతుల విషయంలోనూ రెండున్నరేళ్లు జాప్యం చేసింది మీరు కదా? ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంటే చర్చను దారి మళ్లించేందుకు ఎన్డీఎస్ఏ కు అప్పగిస్తామంటూ కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్ల అవినీతి, నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల గోదావరి జలాలను తెలంగాణ ప్రజలు వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా రాజకీయ డ్రామాలు పక్కనపెట్టండి.. ఎన్డీఎస్ఏ సిఫార్సులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయండి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణను వేగవంతం చేయండి లేనిపక్షంలో తెలంగాణ రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ బలికాక తప్పదు’ అని కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు.

Next Story