కాసుల కక్కుర్తికి ఆశపడి సిరుల తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: ప్రభుత్వ విప్, వేముల వీరేశం పోస్టు

by Malleboina Mahesh |

సిరుల తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు.. కేటీఆర్ కుతంత్రాలపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం సోషల్ మీడియాలో తీవ్ర ధ్వజం!

కాసుల కక్కుర్తికి ఆశపడి సిరుల తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారు: ప్రభుత్వ విప్, వేముల వీరేశం పోస్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్.. ఇంకెంత కాలం తెలంగాణను పీక్కు తింటారు? తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని ప్రభుత్వ విప్, వేముల వీరేశం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రగతి భవన్ ముళ్లకంచెల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని చెరపట్టారని, కాసుల కక్కుర్తికి ఆశపడి సిరుల తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల చైతన్యం ముందు కుప్పకూలి ఫామ్‌హౌస్‌లో బందీ అయ్యారని, అయినా మీ కుట్రలు ఆగలేదు, కుతంత్రాలకు అంతే లేదు, ఏం కావాలి మీకు? అని వేముల వీరేశం నిలదీశారు. పదేళ్లలో అధికార అహంకారం తో విర్రవీగి, విచ్చలవిడిగా అవినీతితో చెలరేగిపోయి అనకొండ స్థాయికి ఎదిగినా మీ ఆశ చావలేదా? ఏం కావాలి మీకు? కాళేశ్వరం బ్యారేజీలు కొట్టుకుపోయి అమాయకుల ప్రాణాలు గోదావరిలో తేలాలా? అని ఆయన ప్రశ్నించారు.

రైతుల పేరు చెప్పి రక్తచరిత్ర లిఖించాలని చూస్తున్నారా? రెచ్చగొట్టి రాజ్యంలోకి వచ్చి మరోసారి రాక్షస పాలనను రుచి చూపించాలని అనుకుంటున్నారా? అని వేముల వీరేశం ప్రశ్నించారు. తెలంగాణ చైతన్యం ముందు మీరిప్పటికే చరిత్రలో మిగిలిపోయారు. గుణపాఠాలు నేర్చుకోకపోతే కాలగర్భంలో కలిసిపోతారని ఆయన హెచ్చరించారు. సెంటిమెంట్‌పై అధికారంలోకి వచ్చి తెలంగాణ తల్లిని గడీలో బందీ చేశారని, నియంతలను తలదన్ని ప్రజాస్వామ్యాన్ని మీ పదఘట్టనలు కింద నలిపేశారని వేముల వీరేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల రాజ్యాంగంతో రాక్షస పాలన చేసి రైతులకు సంకెళ్లు వేసి నడిబజారులో నడిపించి వికటాట్టహాసం చేశారని, నేరెళ్ల దళితులకు కరెంట్ షాక్‌లు పెట్టించి తెలంగాణకు కాళరాత్రులను పరిచయం చేశారని ఆయన మండిపడ్డారు.

Next Story