పెళ్లి ఇంట్లో ఘోర విషాదం: ఆటోను ఢీకొట్టిన లారీ.. చిన్నారితో సహా నలుగురు బంధువులు దుర్మరణం!

by Gantepaka Srikanth |

మర్కాపురం జిల్లా కంభం సమీపంలో అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

పెళ్లి ఇంట్లో ఘోర విషాదం: ఆటోను ఢీకొట్టిన లారీ.. చిన్నారితో సహా నలుగురు బంధువులు దుర్మరణం!
X

దిశ, వెబ్‌డెస్క్: మర్కాపురం జిల్లా కంభం సమీపంలో అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెళ్లి వేడుక కోసం ఆటోలో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన బంధువులను యముడిలా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ఒక చిన్నారితో సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆనందంగా సాగాల్సిన పెళ్లి వేడుక క్షణాల వ్యవధిలో కన్నీటి సంద్రంగా మారింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లి వేడుక నిమిత్తం కుటుంబం మొత్తం ఆటోలో కంభం వైపు బయలుదేరింది. అర్ధరాత్రి సమయంలో రహదారి పక్కనే ఆటోను నిలిపి ఉంచారు. కొందరు బంధువులు ఆటోలోనే కూర్చోగా.. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో దూసుకొచ్చిన లారీ, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నజ్జునుజ్జయింది.

ముగ్గురు అక్కడికక్కడే.. ఆస్పత్రిలో చిన్నారి మృతి

ఈ భయానక ప్రమాదంలో ముగ్గురు బంధువులు ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన ఒక చిన్నారిని స్థానికులు, పోలీసులు హుటాహుటిన మర్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి కూడా కన్నుమూసింది. ప్రమాదంలో మరో ఏడుగురు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం మర్కాపురం, ఒంగోలు ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితే విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న మర్కాపురం పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని డ్రైవర్‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story