SI నిర్వాకం.. 6 ఏళ్ల మనవరాలి చేతికి కారు స్టీరింగ్.. మా తాత ఎస్ఐ అంటూ దబాయింపు

by Prasad Jukanti |

బాధ్యతాయుతమైన పోలీస్ శాఖలో ఉంటూ ఓ ఎస్ఐ తన ఆరేళ్ల మనవరాలికి నడిరోడ్డుపై కారు స్టీరింగ్ ఇవ్వడం కలకలం రేపింది.

SI నిర్వాకం.. 6 ఏళ్ల మనవరాలి చేతికి కారు స్టీరింగ్.. మా తాత ఎస్ఐ అంటూ దబాయింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'యాక్సిడెంట్ అంటే బైకో, కారో రోడ్డుమీద పడటం కాదు.. ఓ కుటుంబం మొత్తం రోడ్డుమీద పడిపోవడం'.. ఇది ఓ తెలుగు సినిమాలోని ఫేమస్ డైలాగ్. రోడ్డు ప్రమాదాల వల్ల నిత్యం ఎంతో మంది అయిన వారిని దూరం చేసుకుంటుంటే మరెంతో మంది తమ కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోతున్నారు. రోడ్డు ప్రయాణాల్లో ఏ చిన్న నిర్లక్ష్యమైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పాల్సిన ఓ పోలీస్ ఉన్నతాధికారి అందుకు విరుద్ధంగా తన ఆరేళ్ల మనవరాలితో మెయిన్ రోడ్డుపై కారు డ్రైవింగ్ చేయించడం ఇప్పుడు కలకలం రేపింది. రోడ్డుపై కారు అస్తవ్యస్తంగా వెళ్తుండటంతో పాటు ఆ కారు కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఆ కారులో ఏం జరుగుతుందో అని చూసిన తోటి ప్రయాణికులకు విస్తుపోయే సన్నివేశం కనిపించింది. ఆరేళ్ల పాప డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారును నడుపుతుంటే ఆమె పక్కన ఆమె తాత (ఎస్ఐ) కూర్చుని గైడ్ చేస్తుండటం సంచలనంగా మారింది. వెంటనే ఆ కారును అడ్డుకున్న పోలీసులు సదరు ఎస్ఐ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వైరల్‍గా మారిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో చోటు చేసుకుంది.

అంకుల్ మా తాత ఎస్సై:

హైదర్ షాకోట్ నుంచి గంధంగూడ వెళ్లే మెయిన్ రోడ్డుపై ఇవాళ ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ కావడంతో ఏదైనా యాక్సిడెంట్ జరిగిందేమో అని చుట్టుపక్కలా చూస్తున్న వాహనదారులకు అటువంటి దృశ్యాలేమి కనబడలేదు. కానీ ఓ షిఫ్ట్ కారు మాత్రం నడిరోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తుండటం గమనించారు. ఎవరా అని వెళ్లి చూడగా డ్రైవింగ్ చేస్తోంది ఓ ఆరేళ్ల పాప. ఆమె పక్కనే ఓ పెద్దాయన కనిపించారు. స్టీరింగ్ కూడా సరిగా పట్టుకోవడం రాకపోయినా కనీసం బ్రేకులపైకి కాళ్లు కూడా అందనంత చిన్నతనంలో ఉన్నా ఆ బాలిక డ్రైవింగ్ సీట్లో కుర్చుని కారును నడుపుతుండటం చూసి వాహనదారులు ఆశ్చర్యపోయారు. వెంటనే కారును ఆపి అడిగితే కారులో ఉన్న పాప ఇచ్చిన ఆన్సర్ చూసి అందరూ మరింత షాక్ తిన్నారు. పసిపాపకు కారు డ్రైవింగ్ ఇవ్వడం ఏంటని కారులో ఉన్న ఎస్ఐని నిలదీస్తుండగా వారిని అడ్డుకున్న పాప అంకుల్ మా తాత ఎస్ఐ.. అంటూ ఉల్టా దబాయించింది. ఆ పాప మాటలకు దిమ్మరిగిపోయిన ఆ వాహనదారులకు సదరు ఎస్ఐ ఇచ్చిన అన్సర్ మరింత మతిపోగెట్టేసింది. ఇది ఆటోమేటిక్ కారు అని కంట్రోల్ అంతా నా చేతిలోనే ఉందని చెప్పాడు. దాంతో వందలాది మంది ప్రయాణికుల భద్రతకు సంబంధించి ఇలా ఎలా నిర్లక్ష్యం చేస్తారని ప్రశ్నించగా ఇప్పుడు మీరు ఏం చేయదల్చుకున్నారు అంటూ సదరు పోలీసు అధికారి దబాయించాడు.

స్పందించిన పోలీసులు:

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్ సిటీ పోలీస్, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఘటనపై చట్టరీత్య అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ విషయాన్ని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ (SHO) ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. దీనిని మేము పరిగణనలోకి తీసుకున్నామని త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా మైనర్ బాలిక చేత డ్రైవింగ్ చేయించిన సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story