రోడ్డుపై భారీ గుంత.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం

by Jakkula.Mamatha |

అనంతగిరి–కోదాడ ప్రధాన రహదారిపై ఖానాపురం గ్రామ శివారులోని రైస్‌మిల్లుల సమీపంలో ఏర్పడిన భారీ గుంత రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది.

రోడ్డుపై భారీ గుంత.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం
X

దిశ, అనంతగిరి: అనంతగిరి–కోదాడ ప్రధాన రహదారిపై ఖానాపురం గ్రామ శివారులోని రైస్‌మిల్లుల సమీపంలో ఏర్పడిన భారీ గుంత రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. ఈ మార్గం మీదుగా అనంతగిరి, కోదాడ ప్రాంతాలకు చెందిన వందలాది వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా భారీ వాహనాలు, బస్సులు, ద్విచక్రవాహనాలు ఒకేసారి ఎదురెదురుగా వచ్చినప్పుడు గుంతను తప్పించుకునే క్రమంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి.వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుంతలో నీరు నిల్వ ఉండటంతో దాని లోతు అంచనా వేయలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో తగినంత వెలుతురు లేకపోవడంతో ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికే పలువురు స్వల్ప ప్రమాదాలకు గురైనట్లు పేర్కొంటున్నారు. రహదారికి ఆనుకుని పలు రైస్‌మిల్లు ఉండటంతో భారీ లారీల రాకపోకలు అధికంగా ఉంటాయి. గుంతను తప్పించేందుకు వాహనాలు రహదారికి అటూ ఇటూ వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. వాహనదారులు హారన్‌లు మోగించుకుంటూ అత్యంత అప్రమత్తంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమాదం జరిగేలోపు వెంటనే గుంతను పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలని, అవసరమైతే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు, స్థానికులు కోరుతున్నారు.

Next Story