ఉద్యోగానికి వెళ్లి అదృశ్యం.. యువకుడి ఆచూకీ కోసం కంచన్‌బాగ్ పోలీసుల గాలింపు

by Taduka Kalyani |

విధులకు వెళ్లిన ఓ యువకుడు అనూహ్యంగా అదృశ్యమైన ఘటన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఉద్యోగానికి వెళ్లి అదృశ్యం.. యువకుడి ఆచూకీ కోసం కంచన్‌బాగ్ పోలీసుల గాలింపు
X

దిశ, చంపాపేట్, జూలై 12: విధులకు వెళ్లిన ఓ యువకుడు అనూహ్యంగా అదృశ్యమైన ఘటన కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురా, ఒమర్ ఫారూక్ మసీదు సమీపంలో నివాసముంటున్న మొహమ్మద్ అజమ్ హుస్సేన్ (30) గత నాలుగు నెలలుగా బాలాపూర్ రోడ్డులోని హఫీజ్ బాబా నగర్ ప్రాంతంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో విధులకు వెళ్తున్నట్లు ఇంటి నుంచి బయలుదేరిన ఆయన తిరిగి ఇంటికి చేరుకోలేదు. అజమ్ హుస్సేన్ భార్య షాజహా బేగం ఇచ్చిన ఫిర్యాదులో, రాత్రి వరకు భర్త ఇంటికి రాకపోవడంతో పలుమార్లు ఫోన్ చేసినా స్పందించలేదని పేర్కొన్నారు. అనంతరం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని మొహమ్మద్ ఘౌస్‌ను సంప్రదించగా, అదే రోజు రాత్రి సుమారు 10 గంటల సమయంలో తన కుమారుడి ఆరోగ్యం బాగోలేదని చెప్పి, యజమానికి చెందిన హోండా యాక్టివా (TS12EH4354)పై అక్కడి నుంచి వెళ్లినట్లు తెలిపినట్లు వివరించారు. ఆ తర్వాత నుంచి ఆయన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో బంధువులు, స్నేహితులు, తెలిసిన ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదని తెలిపారు. దీంతో కంచన్‌బాగ్ పోలీసులు క్రైమ్ నం. 187/2026 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గల్లంతైన మొహమ్మద్ అజమ్ హుస్సేన్ ఎత్తు 5 అడుగుల 1 అంగుళం, గోధుమవర్ణం, గుండ్రని ముఖం, నలుపు-తెలుపు రంగు జుట్టు కలిగి ఉంటాడు. చివరిసారిగా నీలం రంగు పఠానీ దుస్తులు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మొహమ్మద్ అజమ్ హుస్సేన్ ఆచూకీ తెలిసిన వారు వెంటనే కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ (ఫోన్: 8712661298) లేదా దర్యాప్తు అధికారి ఎస్‌ఐ ఎం. శ్రీకాంత్ (మొబైల్: 8712661027)కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story