గ్రామపంచాయతీ కార్మికులకు జీఓ నెం. 6 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి

by Batti.Sumithra |

టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్. మధుసూదన్ రెడ్డి గ్రామపంచాయతీ కార్మికులకు జీఓ ప్రకారం వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు కల్పించి, పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీ కార్మికులకు జీఓ నెం. 6 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి
X

దిశ, పినపాక : గ్రామపంచాయతీ కార్మికులకు జీఓ నెం. 6 లేదా జీఓ నెం. 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పనిభారం తగ్గించాలని, గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా, ఈరోజు పినపాక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంపీడీవో, ఎంపీవోలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,732 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న 54,200 మంది ఆన్‌లైన్‌లో నమోదైన కార్మికులతో పాటు, మరో 6,000 మంది నమోదు కాని కార్మికులు కూడా గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్నారని తెలిపారు.

రాష్ట్రంలో అమలులో ఉన్న 73 షెడ్యూల్ జీఓలను రద్దు చేసి, మూడు జోన్లుగా విభజిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త వేతనాలను ప్రకటించారని చెప్పారు. ఈ వేతనాల పెంపుదలకు సంబంధించి జీఓ నెం. 6 విడుదల చేసి గెజిట్‌లో ప్రచురించారని పేర్కొన్నారు. రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తెస్తున్న వేలాది మంది గ్రామపంచాయతీ కార్మికులను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించి, జీఓ నెం. 6 ప్రకారం పెంచిన వేతనాలను గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎంపీడీవో, ఎంపీవోలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొమరం లక్ష్మయ్య, పి. సారయ్య, నామా వెంకన్న, మేకల మౌనిక, వల్లెపు సంపత్, ఊడుగుల వెంకటేష్, కొరం సమ్మయ్య, సాధనపల్లి రమేష్, తోకల నరసయ్య, గుంటక రామారావు, కొమరం వెంకటనారాయణ, పూనెం మధు, బుడుగుల శ్రీను, పి. నాగరాజు, రామకృష్ణ, నవాతు రాము, దుర్గం పీరయ్య, సమ్మయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story