ఇంటర్నెట్ సెలబ్రిటీ "Punch" కోతిపిల్ల.. జూ ముందు క్యూ కడుతున్న వేలాది సందర్శకులు

by Muthe.Rajitha |

ఇటీవల జపాన్ లోని ఓ జూలో తల్లిని కోల్పోయిన ఓ చిన్న కోతిపిల్ల "పంచ్" ను చూడటానికి వేలాదిగా సందర్శకులు తరలివస్తున్నారు.

ఇంటర్నెట్ సెలబ్రిటీ Punch కోతిపిల్ల.. జూ ముందు క్యూ కడుతున్న వేలాది సందర్శకులు
X

దిశ, వెబ్ డెస్క్ : జపాన్‌లోని ఇచికావా జూలాజికల్ పార్క్ (Ichikawa Zoological Park) లో తల్లిని కోల్పోయిన చిన్న కోతిపిల్ల “పంచ్” ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు... ఇంటర్నెట్లో సంచలనం అయింది. ఇబరాకి ప్రిఫెక్చర్ లో ఉన్న ఈ జూలో గత జనవరిలో జన్మించిన ఈ చిన్న జపనీస్ మకావ్ అనే కోతిపిల్ల.. పుట్టిన కొద్దిరోజులకే తన తల్లిని కోల్పోయింది. తల్లి అకస్మాత్తుగా మరణించడంతో పంచ్ పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది. చిన్న వయసులోనే తల్లి ప్రేమ కోల్పోవడంతో చాలా దిగులు పడింది. అయితే దానికి జూ సిబ్బంది ఒక కోతిబొమ్మను ఇవ్వడంతోపాటు, పాలు పట్టిస్తూ ప్రేమగా పెంచడం ప్రారంభించారు. అంతేకాదు దానికి "పంచ్" అనే పేరు కూడా పెట్టారు. ఇక జూలోని మిగతా కోతులు దానిని దూరం తరిమేశాయి. కొన్నిసార్లు హింసించాయి కూడా. దాంతో పంచ్ ఎప్పుడూ తన దగ్గర ఉన్న కోతిబొమ్మనే హత్తుకొని ఉండేది. ఆ బొమ్మనే తన తల్లిగా భావిస్తూ.. మిగతా కోతుల నుంచి దూరంగా, భయపడుతూ ఉండేది.

ఇంటర్నెట్ సెలెబ్రిటీ "పంచ్"

అయితే ఇదంతా జూకి వచ్చిన కొంతమంది సందర్శకులు వీడియో తీసి పలు సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడంతో.. తల్లిప్రేమకు నోచుకోని, తోటి కోతుల చేత దాడి చేయబడుతున్న ఆ పంచ్ కోసం నెటిజన్స్ తల్లడిల్లిపోయారు. ప్రస్తుతం ఆ వీడియోలు నెట్లో విపరీతంగా షేర్ అవుతూ.. వందల మిలియన్స్ వ్యూస్ పొందుతున్నాయి. చుసిన ప్రతీ ఒక్కరూ అయ్యో పాపం.. పంచ్ అంటున్నారు. కొంతమంది తల్లి దగ్గర లేకపోతే, తల్లిప్రేమ లేకపోతే పిల్లలు ఎలాంటి కష్టాలు పడతారో, ఎంత బాధను అనుభవిస్తారో అంటూ వాపోతున్నారు. కాగా ఇటీవల పంచ్ తో ఉండే తోటి కోతి దానిని దగ్గరకు తీసి ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టింది. మిగతా కోతుల దాడి నుంచి కాపాడుతూ.. క్షణం కూడా పంచ్ ను వదలకుండా ప్రేమగా సాకుతోంది. ఇంకేముందీ సందర్శకులు దీనిని కూడా పోస్ట్ చేయడంతో మరోసారి మన పంచ్ వైరల్ అయింది. ఇప్పటికైనా తల్లిప్రేమ దక్కింది అని సంతోషపడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పంచ్‌ను చూడటానికి ప్రతి రోజు వేలాది మంది జూకు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో జూ కిక్కిరిసిపోతోంది. చిన్న చేతులతో బాటిల్ పట్టుకుని పాలు తాగడం, ఒంటరిగా కూర్చుని చుట్టూ చూడటం, సిబ్బందిని గట్టిగా పట్టుకోవడం చూసి చాలా మంది భావోద్వేగానికి గురవుతున్నారు. కొందరు దాని పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ వీడియోలన్నీ సోషల్ మీడియా వేదికల్లో హల్ చల్ చేస్తున్నాయి. పంచ్ కథ జపాన్ మాత్రమే కాదు, ఇతర దేశాల ప్రజలను కూడా కదిలిస్తోంది.

జూ ముందు బారులు

పంచ్ రాకముందు ఈ జూకు రోజుకు సుమారు 1,500 నుంచి 2,000 మంది వరకు సందర్శకులు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 5,000 నుంచి 7,000 వరకు పెరిగింది. సందర్శకులు పెరగడంతో జూకు వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. జూ అధికారులు ఆ డబ్బును పంచ్ సంరక్షణతో పాటు ఇతర జంతువుల సంరక్షణకు ఉపయోగిస్తున్నారు. పంచ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక బాటిల్ ఫీడింగ్ ఏర్పాటు చేశారు. దానికి ఆటబొమ్మలు ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇతర కోతి పిల్లలతో కలిసిపోవడానికి సామాజికంగా అలవాటు చేయడానికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. పంచ్ ఒంటరితనం, మానవులపై ఆధారపడే పరిస్థితి చూసి ప్రపంచవ్యాప్తంగా జంతు సంరక్షణపై మళ్లీ చర్చ మొదలైంది. ఒక చిన్న ప్రాణి జీవించేందుకు మనుషులు ఎలా సహాయం చేయగలరో ఈ కథ అద్దం పడుతోంది. ఇప్పుడు పంచ్ జపాన్‌లో ఒక చిన్న “సెలబ్రిటీ”గా మారిపోయింది.

Next Story