దళితుల భూములపై జులుం..!

by Jakkula.Mamatha |

సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలో 656 సర్వే నెంబర్‌లో 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉన్నది.

దళితుల భూములపై జులుం..!
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలో 656 సర్వే నెంబర్‌లో 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ అసైన్డ్ భూమి ఉన్నది. అయితే ఈ భూమిని అప్పటి ప్రభుత్వం సాగు కోసమని ఇక్కడ నివసించే రైతులకు ఇచ్చింది. గత 70 సంవత్సరాల నుంచి అదే భూమిపై ఆధారపడి చాలామంది వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ జీవిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మండలంలో భూముల రేట్లు కోట్లకు పడగలు ఎత్తడంతో ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సర్వే నెంబర్‌లో దళితులకు సంబంధించిన భూమిని కొందరు అధికారుల అండదండలతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భూ బాధితులైన దళితులు కంది తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు.

మాకు సరైన న్యాయం చేసి తీరాలి..

సర్వే నంబర్ 656లో ప్రస్తుతం దళితులకు సంబంధించి దాదాపు 35 ఎకరాల ప్రభుత్వ లావుని పట్టా భూమి ఉన్నది. ఇదే భూమిని ఆధారంగా వారు వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. రెండు రోజుల క్రితం వర్షాకాలం మొదలైన నేపథ్యంలో స్థానిక రైతులు ఆ భూమిలో వ్యవసాయం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో స్థానిక రెవెన్యూ అధికార సిబ్బంది కొంతమంది అక్కడికి వచ్చి అక్కడ ఎలాంటి పనులు చేపట్టరాదు అంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బాధితులు గురువారం కంది తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 70 సంవత్సరాలుగా తమ తాతల నాటి నుంచి ఇదే భూమిపై వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ బ్రతుకుతున్నామంటూ వారు స్థానిక నూతన తహసీల్దార్ హసీనా బేగం ఎదుట వాపోయారు. కొంతమంది రాజకీయ పలుకుబడితో దళితులైన తమకు అన్యాయం చేయాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాగైనా న్యాయం చేసి తీరాలంటూ ముక్తకంఠంతో వారు నినదించారు.

అనుకున్న వారికి అనుకున్నంత..

కంది మండల కేంద్రంలోని 656 సర్వే నెంబర్‌లో గతంలో ప్రభుత్వం నుంచి భూమి పొందిన వారు చాలా వరకు వాటిని పట్టా భూములుగా మార్చుకున్నారు. అయితే కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న వారు తమకు ఇచ్చిన దానికంటే ఎక్కువ భూములు తమ పేర పట్టా చేసుకున్నట్లు ఆరోపణలు బయటికి వస్తున్నాయి. గతంలో ఒకే సర్వే నెంబర్‌లో 200కు పైగా ఎకరాలు ఉండేది. ప్రస్తుతం 656/215/ఆ బై సర్వే పేరుతో కొంతమంది వ్యక్తులకు ఎకరాల కొద్దీ ఇక్కడ పట్టా భూములు వారికి ఎలా వచ్చాయి అంటూ స్థానిక దళితులు ప్రశ్నిస్తున్నారు. వీటన్నిటిపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు స్పందించి తమకు సరైన న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు.

సర్వే చేసి చర్యలు తీసుకుంటాం..

ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేసుకుని ప్రస్తుతం నష్టపోయామని వాపోతున్న దళితులకు సంబంధించిన విషయంలో రెవెన్యూ అధికారులు న్యాయం చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇందులో పట్టా భూమి ఎంత..? ప్రభుత్వ అసైన్డ్ భూమి ఎంత..?, లావుని పట్టా భూమి ఎంత..? అనే విషయాల ఆధారంగా పూర్తిస్థాయి సర్వే చేసి తగిన చర్యలు తీసుకుంటామంటూ స్థానిక రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే గతంలోనే చాలాసార్లు అప్పటి రెవెన్యూ అధికారులు జిల్లా యంత్రాంగం ఆదేశాలు మేరకు సర్వేలు చేసినా కూడా కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బట్టబయలు అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి దళితులైన తమకు పూర్తిస్థాయి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అటు దళిత సంఘాల నాయకులు, భూ బాధితులు వాపోతున్నారు.

Next Story