- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరి కొయ్యలకు నిప్పు.. జాతీయ రహదారి పక్కన కాలిబూడిదైన మొక్కలు
వరి కోతల అనంతరం పొలాల్లో మిగిలిన కోయలకు రైతులు నిప్పు పెట్టడం వల్ల కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న 65వ జాతీయ రహదారి పక్కన ప్రభుత్వం నాటిన వందలాది మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి.

దిశ, కోదాడ: వరి కోతల అనంతరం పొలాల్లో మిగిలిన కోయలకు రైతులు నిప్పు పెట్టడం వల్ల కోదాడ నియోజకవర్గ పరిధిలో ఉన్న 65వ జాతీయ రహదారి పక్కన ప్రభుత్వం నాటిన వందలాది మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో రహదారి పక్కన ఉన్న చెట్లు పూర్తిగా కాలిపోయి ఎండిపోయాయి. దీంతో పచ్చదనంతో కళకళలాడాల్సిన ప్రాంతం ఇప్పుడు కాలి బూడిదగా మారింది. స్థానికుల వివరాల ప్రకారం, రహదారికి ఆనుకుని ఉన్న వ్యవసాయ భూముల్లో వరి కోయలకు నిప్పు పెట్టగా, గాలుల ప్రభావంతో మంటలు జాతీయ రహదారి పక్కకు వ్యాపించాయి. ఈ క్రమంలో రహదారి విస్తరణ, హరితహారం కార్యక్రమాల కింద నాటిన మొక్కలు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని చెట్లు పూర్తిగా కాలిపోగా, మరికొన్ని చెట్లు ఆకులు, కొమ్మలు కోల్పోయి ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.
ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు చేసి నాటిన మొక్కలు క్షణాల్లో బూడిద కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో సంబంధిత శాఖలు విఫలమవుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు గాలి కాలుష్యం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా రహదారుల పక్కన ఉన్న చెట్లు కాలిపోవడం వల్ల ప్రయాణికులకు నీడ, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, వ్యవసాయ అవశేషాల నిర్వహణపై ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహించాలని స్థానికులు కోరుతున్నారు. కాలిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి పచ్చదనాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు.






