దర్శకులు నాకు అలాంటి పాత్రలు ఇవ్వడం లేదు.. ఇది చాలా విచారకరమంటూ హృతిక్ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

మీరు ఎలాంటి పాత్ర కోసం చూస్తున్నారు? అని నన్ను ఒకరు అడిగారు. దానికి నా మనసులో నుంచి వచ్చిన సమాధానం నన్నే ఆశ్చర్యపరిచింది.

దర్శకులు నాకు అలాంటి పాత్రలు ఇవ్వడం లేదు.. ఇది చాలా విచారకరమంటూ హృతిక్ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గత ఏడాది ‘వార్-2’ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మెప్పించలేక మిక్స్‌డ్ టాక్‌ను రాబట్టుకుంది. ప్రస్తుతం హృతిక్ రోషన్ తన తండ్రి రాకేష్ రోషన్ నిర్మాణంలో వస్తున్న ‘క్రిష్ 4’ సినిమాతో దర్శకుడిగా కూడా మారుతున్నారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతుండగా.. హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను 2027లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్యారిస్‌ వెకెషన్ ఎంజాయ్ చేస్తున్న హృతిక్ ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ ముందు దిగిన ఒక సెల్ఫీని షేర్ చేస్తూ, ఆయన పెట్టిన పోస్ట్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తనకు నటుడిగా సవాల్ విసిరే వైవిధ్యమైన పాత్రలు రావడం లేదని, దర్శకులు తనను కేవలం రొటీన్ హీరో పాత్రల్లోనే చూపించాలనుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"మీరు ఎలాంటి పాత్ర కోసం చూస్తున్నారు? అని నన్ను ఒకరు అడిగారు. దానికి నా మనసులో నుంచి వచ్చిన సమాధానం నన్నే ఆశ్చర్యపరిచింది. ‘లక్ బై చాన్స్’ సినిమాలో నేను చేసిన 'జాఫర్' పాత్ర గుర్తుందా? అలాంటి పాత్ర వస్తే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాను. కానీ, దర్శకులు నన్ను కేవలం మంచి వాడిగానే (హీరోగా) చూడాలనుకుంటున్నారు. ఇది చాలా విచారకరం" అని హృతిక్ రాసుకొచ్చారు. దీనిపై ఆ సినిమా దర్శకురాలు జోయా అఖ్తర్ స్పందిస్తూ.. కలిసి కాఫీ తాగుదాం రా అంటూ కామెంట్ చేశారు. కాగా.. 2009లో వచ్చిన ‘లక్ బై చాన్స్’ సినిమాలో హృతిక్ రోషన్ ‘జాఫర్ ఖాన్’ అనే బాలీవుడ్ సూపర్ స్టార్ పాత్రలో కాసేపు మెరిశారు. పైకి ఎంతో మర్యాదగా కనిపిస్తూ, లోపల స్వార్థంతో, తన ఎదుగుదల కోసం ఎవరినైనా తొక్కేసే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అది. ఇకపై తనకు అలాంటి పాత్రల్లోనే కనిపించాలని ఉందంటూ హృతిక్ వెల్లడించారు.

Next Story