ప్రభుత్వ వైద్యుల ఆందోళన బాట.. రాష్ట్రవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్

by Kema Shiva Kumar |

తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు ఇవాళ ఉదయం నుంచి విధులను బహిష్కరించి ఆకస్మికంగా సమ్మెకు దిగారు.

ప్రభుత్వ వైద్యుల ఆందోళన బాట.. రాష్ట్రవ్యాప్తంగా ఓపీ సేవలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. బదిలీల్లో జీవో నెం.38 నిబంధనలను పూర్తిస్థాయిలో అమలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (TGGDA) విధించిన గడువుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వైద్యులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు విధులను బహిష్కరించి సమ్మెకు దిగారు.

స్తంభించిన ఓపీ సేవలు.. రోగుల అవస్థలు

వైద్యుల ఆకస్మిక సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉస్మానియా (Osmania), గాంధీ (Gandhi) వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఆసుపత్రుల్లో అత్యంత కీలకమైన ఔట్ పేషెంట్ సేవలను వైద్యులు పూర్తిగా నిలిపివేశారు. ఉదయం నుంచే చికిత్స కోసం ఆసుపత్రులకు క్యూ కట్టిన వేలాది మంది పేద రోగులు, మహిళలు, వృద్ధులు ఓపీ స్లిప్పులు (OP Slips) దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, మానవీయ కోణంలో కేవలం అత్యవసర సేవలను మాత్రమే మినహాయించామని, మరే ఇతర సాధారణ సేవలు అందించేది లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఆసుపత్రుల ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైద్యులు పెద్ద పెట్టున నిరసనలు తెలుపుతున్నారు.

టీజీజీడీఏ కీలక డిమాండ్లు ఇవే..

బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలంటూ టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లల్లు ప్రసాద్ రాథోడ్ డిమాండ్ చేశారు. బదిలీల్లో జీవో నెం.38 నిబంధనలను వంద శాతం యథాతథంగా అమలు చేయాలి. భార్యాభర్తలు ఒకేచోట పనిచేసేలా స్పౌస్ (Spouse) ప్రమాణాలను, ఇతర ప్రాధాన్యతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలి. అసోసియేషన్ నాయకులకు నిబంధనల ప్రకారం బదిలీల నుండి మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి వెంటనే తమతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని సంఘం నేతలు కోరారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించని పక్షంలో రాబోయే రోజుల్లో అత్యవసర సేవలను కూడా నిలిపివేసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వైద్యుల సంఘం హెచ్చరికలు జారీ చేసింది.

Next Story