ఎర్రగుంట చెరువు ఆక్రమణలపై గ్రామస్తుల రాస్తారోకో

by Jakkula.Mamatha |

కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ ఎర్రగుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎర్రగుంట గ్రామస్తులు, రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

ఎర్రగుంట చెరువు ఆక్రమణలపై గ్రామస్తుల రాస్తారోకో
X

దిశ, పాల్వంచ రూరల్: కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ ఎర్రగుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎర్రగుంట గ్రామస్తులు, రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై భారీ వాహనాలు, ఇతర వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయి.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఎర్రగుంట చెరువును కొందరు వ్యక్తులు ఆక్రమించి కబ్జా చేస్తున్నారని, పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

చెరువును పూర్తిగా ఆక్రమణల నుంచి విముక్తి చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా కొంతసేపు రాకపోకలు స్తంభించాయి, "మా ఎర్రగుంట చెరువును కాపాడండి.. ఆక్రమణదారులపై వెంటనే చర్యలు తీసుకోండి" అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు సమాచారం.

Next Story