' ప్రజల ప్రాణాలు ముఖ్యం.. కంపెనీ కాదు '

by Batti.Sumithra |

ప్రజల సమక్షంలో హియరింగ్ నిర్వహించి, ప్రజల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.

 ప్రజల ప్రాణాలు ముఖ్యం.. కంపెనీ కాదు
X

దిశ, మెదక్ టౌన్ : ప్రజల సమక్షంలో హియరింగ్ నిర్వహించి, ప్రజల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్ల గౌరారం, రంగయ్యపల్లి గ్రామాలకు చెందిన సుమారు 400 మంది గ్రామస్తులు సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించి, ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ కంపెనీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. అయితే కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో గ్రామస్తులు అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు.

వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ స్వయంగా రెండు గ్రామాలకు వచ్చి ప్రజల సమక్షంలో బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ (హియరింగ్) నిర్వహించి, ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే వచ్చే సోమవారం వేలాది మందితో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా అగర్వాల్ స్టీల్ కంపెనీ నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము, శబ్ద కాలుష్యంతో చెట్ల గౌరారం, రంగయ్యపల్లి గ్రామాల ప్రజల జీవనం నరకప్రాయంగా మారిందని ఆరోపించారు. నెలకు లక్ష క్వింటాళ్లకు పైగా స్టీల్ ఉత్పత్తి జరగడం వల్ల కాలుష్యం తీవ్రస్థాయికి చేరిందని తెలిపారు. వర్షాలు కురిసినప్పుడు నల్లటి నీరు పడుతోందని, గ్రామాల్లోని చెరువులు, బోర్లు కలుషితమై తాగునీటికి పనికిరాకుండా పోయాయని, ప్రస్తుతం మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆరేసిన బట్టలు సాయంత్రానికే నల్లగా మారిపోతున్నాయని, మహిళలు చర్మవ్యాధులు, పిల్లలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, రైతుల పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సంపాదించిన డబ్బంతా ఆస్పత్రులకే ఖర్చవుతోందని పేర్కొన్నారు. కంపెనీని వెంటనే గ్రామాల నుంచి తొలగించాలని, అది సాధ్యం కాకపోతే రెండు గ్రామాల ప్రజలకు తగిన పునరావాసం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల జీవితాలకు సంబంధించిన కీలక అంశంపై ప్రజాభిప్రాయ సేకరణను పోలీసుల పికెటింగ్ మధ్య నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామాలకు వచ్చి ప్రతి కుటుంబం అభిప్రాయాన్ని తెలుసుకునేలా పారదర్శకంగా హియరింగ్ నిర్వహించాలని కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ప్రజల అభిప్రాయానికే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ, ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ వల్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. కంపెనీ నుంచి వెలువడే నల్లటి పొగతో ఇళ్లు, చెట్లు, పంటలు దుమ్ముతో కప్పుకుపోతున్నాయని, వర్షపు నీటితో చెరువులు, బోర్లు కలుషితమై తాగునీరు, వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే కంపెనీ ప్రయోజనాలకే అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించిన గ్రామస్తులు, జిల్లా కలెక్టర్ రెండు గ్రామాలను స్వయంగా సందర్శించి ప్రతి కుటుంబం అభిప్రాయాన్ని తెలుసుకుని, ప్రజల నిర్ణయానికే తుది ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. కంపెనీని వెంటనే తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని, లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Next Story