వరుణ దేవా.. కరుణ లేదా

by Batti.Sumithra |

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచిన వానలు కురువకపోవడంతో లింగంపేట మండలంలోని రైతన్న తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

వరుణ దేవా.. కరుణ లేదా
X

దిశ, లింగంపేట : ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచిన వానలు కురువకపోవడంతో లింగంపేట మండలంలోని రైతన్న తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సకాలంలో వానలు కురవకపోవడంతో విత్తిన మొలకలు వాడి పోతుండడంతో అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు.' వరుణ దేవా... మాపై నీకు కరుణ లేదా ? అంటూ నిరాశకు లోనవుతున్నారు. వర్షాల కోసం పూజలు చేస్తున్నారు. లింగంపేట మండలంలోని మోతె గ్రామస్తులు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం సప్త భజన ప్రారంభించారు. గ్రామానికి చెందిన పలువురు భక్తులు ఐదు బృందాలుగా ఏర్పడి సప్త భజన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వీరు ఐదు రోజుల పాటు ఆలయంలో వర్షాల కోసం 'నాన్ స్టాప్' గా భజనలు చేస్తారని గ్రామ సర్పంచ్ వజీర్ సుజాత అశోక్ రావు తెలిపారు. గ్రామస్తులంతా కలిసి ముందుగా ఆలయంలోని శివలింగం మునిగేలా నీటిని పోశారు.

లింగంపేటలో కప్ప కావడి..

'కప్ప కప్ప కావిడి.. వాన కొట్టు దేవుడా... అంటూ సోమవారం లింగంపేట మండల కేంద్రంలో పలువురు రైతులు కప్పకావిడిని నిర్వహించారు. కప్పను రోకలికి కట్టి వేపాకులు చుట్టి ఇద్దరు వ్యక్తులు భుజాల పై ఎత్తుకొని ఇంటింటా తిప్పితే వరుణ దేవుడు కరుణిస్తాడని రైతుల నమ్మకం. ఈ క్రమంలోనే కప్పతల్లిని ఇంటింటా తిప్పగా మహిళలు పసుపు కుంకుమలు వేసి కప్పతల్లి పై నీళ్లను పోశారు. పంటల సాగు సమయం దాటిపో తోందని ఇకనైనా వరుణ దేవుడు కరుణించి వానలు కురిపించాలని వీరు మొక్కుకున్నారు.

Next Story