రోడ్డు కోసం ఏళ్లుగా నిరీక్షణ..!

by Batti.Sumithra |

జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న మహబూబాబాద్ మండలంలోని అయోధ్య గ్రామం అభివృద్ధికి మాత్రం దూరంగానే మిగిలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు కోసం ఏళ్లుగా నిరీక్షణ..!
X

దిశ, మహాబూబాబాద్ ప్రతినిధి : జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న మహబూబాబాద్ మండలంలోని అయోధ్య గ్రామం అభివృద్ధికి మాత్రం దూరంగానే మిగిలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సుమారు 15 ఏళ్ల క్రితం నిర్మించిన రహదారుల తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనిగపురం–అయోధ్య మధ్య సుమారు 2 కిలోమీటర్లు, తాళ్లపూసపల్లి–అయోధ్య మధ్య సుమారు 1 కిలోమీటర్ మేర ఉన్న రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలు మరింత కష్టసాధ్యంగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. రోడ్ల సమస్య పై పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిచినట్లు సమాచారం వచ్చినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని అంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రులకు తరలించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో అంబులెన్స్‌లు కూడా గ్రామంలోకి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాయని చెప్పారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం, వృద్ధులు బయటకు రావడం, గర్భిణీలు వైద్య సేవలు పొందడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు.

Next Story