అక్రమ కోళ్ల ఫారం నిర్మాణంపై గ్రామస్తుల ఆందోళన

by Ratna Kumari |

మండలంలోని దామెర భీమనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా కోళ్ల ఫారం నిర్మాణం చేపట్టి, కోళ్ల పెంపకం కూడా కొనసాగిస్తున్నారంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ కోళ్ల ఫారం నిర్మాణంపై గ్రామస్తుల ఆందోళన
X

దిశ, మర్రిగూడ : మండలంలోని దామెర భీమనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో అనుమతులు లేకుండా కోళ్ల ఫారం నిర్మాణం చేపట్టి, కోళ్ల పెంపకం కూడా కొనసాగిస్తున్నారంటూ గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయం నిర్మాణ పనులను నిలిపివేయాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, సంబంధిత యాజమాని వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలను కొనసాగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ అనుమతుల కోసం గతంలో జారీ చేసిన ఎన్‌వోసీని రద్దు చేయాలని గ్రామసభ తీర్మానం చేసినప్పటికీ, దానిని కూడా లెక్కచేయకుండా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేసి, సంబంధిత యాజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారని కూడా ఆరోపించారు. అక్రమ నిర్మాణాన్ని వ్యతిరేకించిన గ్రామ యువతపై తప్పుడు పత్రాల ఆధారంగా కోర్టులో కేసులు నమోదు చేసి మానసికంగా వేధిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఒకవైపు గ్రామపంచాయతీ నోటీసులను పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తూనే, మరోవైపు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలకు దిగడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు..

ఈ విషయమై గతంలో ఎమ్మెల్యే, జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, సంబంధిత నిర్మాణాలకు చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశాన్ని సమగ్రంగా విచారించాలని కోరారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే వాటిని నిలిపివేసి, నిబంధనల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.

Next Story