ముప్కాల్ గ్రామసభను బహిష్కరించిన గ్రామస్తులు

by Ratna Kumari |

ముప్కాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు.

ముప్కాల్ గ్రామసభను బహిష్కరించిన గ్రామస్తులు
X

దిశ, ముప్కాల్: ముప్కాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రామసభను గ్రామస్తులు బహిష్కరించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు సంబంధించిన అసలు పత్రాలను గ్రామసభ ముందుంచాలని కోరగా, అందుకు సరైన సమాధానం రాకపోవడంతో గ్రామస్తులు సభ నుంచి వాకౌట్ చేశారు. గ్రామస్తుల కథనం ప్రకారం, 15వ ఆర్థిక సంఘం నిధులు, జనరల్ ఫండ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని గ్రామసభలో ప్రశ్నించగా, సర్పంచ్ కొమ్ముల సాయమ్మ, ఉప సర్పంచ్ బ్రమ్మదండి చిన్నయ్య, కార్యదర్శి దివ్య, వార్డు సభ్యులు సరైన వివరణ ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాకుండా, గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా, నిధులను ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని కూడా గ్రామస్తులు ఆరోపించారు. గ్రామపంచాయతీలో దొంగ బిల్లులు, నిధుల వినియోగం, కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు టి.సాయన్న, నాయకుడు సంతోష్, శంకర్, శ్రీనివాస్ గౌడ్, పోశెట్టి తెలిపారు. సర్పంచ్ కొమ్ముల సాయమ్మ, కార్యదర్శి దివ్యల వ్యవహారంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Next Story