ఒంటరిగానే పోరాడతాం.. టీవీకే సత్తా చాటుతాం: విజయ్ రాజకీయ గర్జన!

by Malleboina Mahesh |

తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. తమిళగ వెట్రి కళగం అనే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.

ఒంటరిగానే పోరాడతాం.. టీవీకే సత్తా చాటుతాం: విజయ్ రాజకీయ గర్జన!
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. తమిళగ వెట్రి కళగం అనే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతుండగా ఇటీవల ఆ పార్టీకి విజిల్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. గత కొంత కాలంగా తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల సమరశంఖాన్ని పూరించాడు.

మామల్లపురం లో జరిగిన పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధుల సమావేశంలో ఆయన తన పార్టీ గుర్తుగా 'విజిల్' (Whistle) ను అధికారికంగా లాంచ్ చేస్తూ, స్వయంగా విజిల్ ఊది కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, గత 30 ఏళ్లుగా ఇతర పార్టీలు తనను తక్కువ అంచనా వేశాయని, కానీ ప్రజలు తనను కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే ఈ స్థితికి తీసుకొచ్చారని భావోద్వేగంగా పేర్కొన్నారు. తమ పార్టీకి ఎవరి మద్దతు లేకపోయినా ఒంటరిగానే పోరాడి గెలుస్తామని, ఇవి కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, ఒక 'ప్రజాస్వామ్య యుద్ధం' అని విజయ్ అభివర్ణించారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ, ప్రధాన పార్టీలైన ఏఐఏడీఎంకే (AIADMK) నేరుగా బీజేపీకి లొంగిపోతే, డీఎంకే (DMK) పరోక్షంగా లొంగిపోయిందని విజయ్ ఘాటుగా విమర్శించారు.

తాము ఏ శక్తులకు, ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, "నా ముఖం చూస్తుంటే ఒత్తిడికి లొంగిపోయే వ్యక్తిలా కనిపిస్తున్నానా?" అని ప్రశ్నించారు. అన్నదురై స్థాపించిన పార్టీలు ఆయనను మర్చిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన విజయ్, తమ సిద్ధాంతాల విషయంలో ఎవరితోనూ రాజీ పడబోమని తేల్చి చెప్పారు. పార్టీ కార్యకర్తలే తన సైనికులని, అందరూ ఐకమత్యం తో పనిచేసి టీవీకే శక్తిని నిరూపించాలని, 234 నియోజకవర్గాల్లో పోటీ చేసి నిలబడే సత్తా తమకు ఉందని, దీనిని ప్రతి కార్యకర్త నిరూపించాలని ఈ సందర్భంగా తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్ పిలుపునిచ్చారు.

Next Story