ఆ ఉపాధ్యాయుల్లో గుబులు!

by Jakkula.Mamatha |

ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించాల్సిన కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్టీలు, రియల్ ఎస్టేట్, బీమా తదితర ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

ఆ ఉపాధ్యాయుల్లో గుబులు!
X

దిశ, ఖమ్మం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహించాల్సిన కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు చిట్టీలు, రియల్ ఎస్టేట్, బీమా తదితర ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై ‘దిశ’లో ‘ముందు వ్యాపారం.. తర్వాతే పాఠశాల’ అనే శీర్షికతో శనివారం ప్రచురితమైన కథనం విద్యాశాఖలో కదలిక కనిపిస్తోంది. నిఘావర్గాలు రంగంలోకి దిగి పూర్తి వివరాలు సేకరించినట్లు సమాచారం. సంబంధిత విద్యాశాఖాధికారి సరైన విచారణ చేయకపోవడంతోనే వివరాలు బయటకు రావడం లేదని దీంతో జిల్లా కలెక్టర్ ఆ బాధ్యతను నిఘా వర్గాలకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. ఖమ్మం రూరల్, ముదిగోండ, తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో పని చేసే కొందరు ఉపాధ్యాయులు ఏదులాపురం మున్సిపాలిటీలో నివాసం ఉంటున్నారు. ఖమ్మానికి దగ్గరగా ఉండటంతో వీరు వ్యాపారాన్ని ఇక్కడే విస్తరించారు. శ్రీరామ్ నగర్, సాయిగణేశ్‌నగర్, ఓరుగంటి నగర్, వరంగల్ క్రాస్‌రోడ్, సాయిప్రభాత్‌నగర్ తదితర కాలనీల్లో ఉండే కొందరు ఉపాధ్యాయులు ప్రధాన వ్యాపారంగా రియల్, బీమా రంగాలను ఎంచుకున్నట్లు గుర్తించారు.

విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం: రూరల్ ఎంఈఓ మూడ్ శ్రీనివాస్

ఉపాధ్యాయులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి, నిజమని తేలితే సంబంధిత ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలతో ఎవరైనా నేరుగా తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి ఫిర్యాదు నిష్పక్షపాతంగా విచారిస్తామని అన్నారు.

Next Story