రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అవినీతి.. ప్రభుత్వ అధికారి ఇంట్లో కుప్పలు తెప్పలుగా నగదు

by Malleboina Mahesh |

ఒడిశా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి ఇంట్లో విజిలెన్స్ అధికారులు రూ. 4 కోట్ల అక్రమ నగదును గుర్తించారు. రూ. 30 వేల లంచం కేసులో మొదలైన తనిఖీలు భారీ అవినీతిని బయటపెట్టాయి.

రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద అవినీతి.. ప్రభుత్వ అధికారి ఇంట్లో కుప్పలు తెప్పలుగా నగదు
X

దిశ, వెబ్ డెస్క్: రూ. 30,000 లంచం తీసుకున్నాడనే ఆరోపణలతో ప్రభుత్వ అధికారి (Government official) ఇంట్లో తనిఖీలు నిర్వహించగా కుప్పలు తెప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ డబ్బులను చూసిన విజిలెన్స్ అధికారులకు కళ్లు చెదిరిపోయేలా ఏ బ్యాగ్ ఓపెన్ చేసిన నోట్ల కట్టలే కనిపించాయి. వాటిని లెక్కించడానికి నిన్నటి నుంచి అధికారులు శ్రమిస్తుండగా.. ఒడిశా విజిలెన్స్ విభాగం చరిత్రలోనే అత్యంత భారీ మొత్తంలో అవినీతి సొమ్ము పట్టుబడినట్లు అధికారులు ప్రకటించారు.

వివరాల్లోకి వెళితే.. కటక్ గనుల శాఖ (Mines Department) డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి రూ. 30,000 లంచం తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన ఒడిశా విజిలెన్స్ అధికారులు అతని నివాసంలో తనిఖీలు చేపట్టారు. అయితే, అక్కడ లభించిన నోట్ల కట్టలను చూసి సాక్షాత్తు అధికారులే విస్తుపోయారు. దేబబ్రత ఇంట్లో ఇప్పటివరకు సుమారు రూ. 4 కోట్ల అక్రమ నగదును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సోదాల సమయంలో దొరికిన నగదు ఇంకా లెక్కింపు దశలోనే ఉందని, ఆ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఒడిశా విజిలెన్స్ చరిత్ర (History of Odisha Vigilance)లో ఒక ప్రభుత్వ అధికారి నుండి ఇంత భారీ స్థాయిలో నగదును స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి అని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం దేబబ్రత మొహంతి‌ని అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆయనకు ఉన్న ఇతర ఆస్తులు మరియు అక్రమ సంపాదన మూలాలపై లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Next Story