వ్యూస్ వ్యసనం.. లైకుల కోసం అసభ్యకర వీడియోలు

by Malleboina Mahesh |   (  Updated:2026-06-29 02:45:05  IST  )

సోషల్ మీడియా వ్యూస్, లైకుల కోసం విచక్షణ కోల్పోయి అసభ్యకర వీడియోలు చేస్తున్న యువత.. హైదరాబాద్‌లో 456 కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు!

వ్యూస్ వ్యసనం.. లైకుల కోసం అసభ్యకర వీడియోలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘మంచి విషయాల గురించి వీడియోలు చూస్తే ఎవరూ చూడటం లేదు సార్.. అదే వివాదాస్పదమైన, అశ్లీలతతో కూడినవి చేస్తే నిమిషాల్లో వేల వ్యూస్ వస్తున్నాయి’.. పోలీసుల విచారణలో నిందితులు చెబుతున్న ఈ సమాధానాలు విస్తు గొలుపుతున్నాయి. కేవలం డిజిటల్ ప్రపంచంలో పాపులారిటీ కోసం తమ ఉజ్వల భవిష్యత్తును పణంగా పెడుతున్న యువత తీరు ఆందోళన కలిగిస్తోంది. గూగుల్ యాడ్సెన్స్ ద్వారా వచ్చే ఆదాయం, బ్రాండ్ ప్రమోషన్ల కోసం వారు సమాజంపై పడే ప్రభావాన్ని కనీసం ఆలోచించడం లేదు. వీరిలో అత్యధికులు 20 నుంచి 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. కేవలం వ్యూస్, లైకుల కోసం విచక్షణ కోల్పోయి నేరాల బాట పడుతున్న వైనం కలకలం రేపుతోంది.

విద్యావంతులు అదే బాటలో..

సాధారణంగా నేరాలు అక్షరాస్యత లేని వారి నుంచి ఆశిస్తాం, కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. డిగ్రీలు, ఇంజినీరింగ్‌లు పూర్తి చేసిన విద్యావంతులు సైతం ఇన్‌ఫ్లూయెన్సర్ల ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. నగరంలో అర్ధరాత్రి మద్యం ఎక్కడ దొరుకుతుంది.. అశ్లీల వెబ్‌సైట్ల వివరాలేంటి.. వంటి అంశాలను ప్రచారం చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అమీర్‌పేట వంటి విద్యా కేంద్రాల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాల్సిన విద్యార్థులు కూడా ఈ వైరల్ వ్యాధి బారిన పడుతున్నారు. రిసెంట్‌గా నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడు నిరాధారమైన వ్యభిచార ఆరోపణలతో వీడియోలు చేసి పోలీసులకు చిక్కడం ఇందుకు నిదర్శనం.

అసభ్య కాన్సెప్టే పెట్టుబడిగా..

కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు కేవలం ఫాలోవర్లను పెంచుకోవడానికి అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్ వంటి అసభ్యకరమైన కాన్సెప్టులతో వీడియోలు రూపొందిస్తున్నారు. సమాజం తలదించుకునేలా ఉన్న ఈ పోస్టులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. విచారణలో పోలీసులు నిలదీసినప్పుడు.. మంచి కంటెంట్ చేస్తే జనాలకు ఎక్కడం లేదు, ఇలాంటివి చేస్తేనే క్లిక్కులు వస్తున్నాయి అని నిస్సిగ్గుగా సమాధానమిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయంపై ఉన్న మక్కువ, తాము చేస్తున్న పని వల్ల సమాజంలోని నైతిక విలువలు ఎంతలా పతనమవుతున్నాయనే స్పృహను వారిలో లేకుండా చేస్తుంది.

పోలీసుల ఉక్కుపాదం..

ఈ తరహా అసాంఘిక పోస్టులపై పోలీసులు ఇప్పుడు సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిరంతరం నిఘా ఉంచుతూ, బాధితుల నుంచి ఫిర్యాదులు అందకపోయినా సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు హైదరాబాద్ పరిధిలోని నాలుగు పోలీస్ కమిషనరేట్లలో కలిపి మొత్తం 456 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిందితులపై కఠినమైన ఐటీ యాక్ట్ సెక్షన్ లతోపాటు ఇతర క్రిమినల్ కేసులు కూడా బనాయిస్తున్నారు. ఒక్కసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఉద్యోగాలకు, పాస్‌పోర్టులకు ఆటంకం కలుగుతుందని తెలిసినా యువత పెడదోవ పడుతుండటం గమనార్హం.

వ్యూస్ కోసం వారిని ప్రోత్సహించి వద్దు..

డిజిటల్ సమాచార మార్పిడికి ఉపయోగపడాలి కానీ, వికృత చేష్టలకు వేదిక కాకూడదు. పెద్ద ఎత్తున సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నాం.. కేవలం వ్యూస్ కోసం చట్ట వ్యతిరేక పనులు చేసేవారిని ప్రోత్సహించవద్దు. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి వీడియోలు చేస్తున్నారు, వారి ఫాలోయింగ్ ఏంటి అనే విషయాలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలి, లేకపోతే వారు నేరగాళ్లుగా మారే ప్రమాదం ఉంది. చట్ట వ్యతిరేక పనులు చేసేవారిని ఈ దశలోనే వారి వికృత ధోరణిని అరికట్టకపోతే మున్ముందు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.:- వి. అరవింద్ బాబు, ఐపీఎస్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ

Next Story