టెన్త్ పరీక్షలకు సూర్యవంశీ డుమ్మా!

by Muthe.Rajitha |

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తన 10th పరీక్షలకు హాజరు కావడం లేదని తెలిపారు.

టెన్త్ పరీక్షలకు సూర్యవంశీ డుమ్మా!
X

దిశ, వెబ్ డెస్క్ : యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరు కావడం లేదని అతని తల్లిదండ్రులు అధికారికంగా వెల్లడించారు. బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. ట్రైనింగ్, అంతర్జాతీయ టోర్నమెంట్లు, నిరంతర ప్రయాణాలు కారణంగా చదువుకు సరైన సమయం కేటాయించలేకపోయారని కుటుంబం పేర్కొంది. CBSE 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరగనున్నప్పటికీ, వైభవ్ ఈ ఏడాది పరీక్షలు రాయకుండా తదుపరి సంవత్సరంలో రాయాలని నిర్ణయించారు.

కేవలం 14 ఏళ్ల వయసులోనే వైభవ్ క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఇంగ్లండ్‌పై 80 బంతుల్లో 175 పరుగులు(15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి భారత్‌కు టైటిల్ అందించాడు. అంతేకాకుండా.. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతూ యంగెస్ట్ సెంచురియన్‌గా గుర్తింపు పొందాడు. అతను బిహార్ రాష్ట్రంలోని సమస్తిపుర్ జిల్లా తాజ్‌పూర్‌లోని మోడెస్టీ స్కూల్‌లో చదువుతున్నాడు. పరీక్షల కోసం అతనికి అడ్మిట్ కార్డు కూడా జారీ అయింది. స్కూల్ యాజమాన్యం, కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత పరీక్షలు వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు.

వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. "ప్రస్తుతం అతను పూర్తిగా క్రికెట్‌పై దృష్టి పెట్టాలి. నిరంతర ట్రావెల్, శిక్షణ కారణంగా చదువుకు సమయం దొరకలేదు. పరీక్షలను ఇప్పుడు రాయడం కంటే వచ్చే ఏడాది సరిగా సిద్ధమై రాయడం మంచిది" అని తెలిపారు. కాగా వైభవ్ నిర్ణయంపై "క్రీడలు ముఖ్యమా? చదువు ముఖ్యమా?" అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే చాలామంది క్రీడల్లో అసాధారణ ప్రతిభ చూపుతున్న యువతకు ఇలాంటి నిర్ణయాలు సమంజసమేనని అభిప్రాయపడుతున్నారు. వైభవ్ భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story