నడిరోడ్డుపై దుర్భాషలు, గంటగంటకూ ఫోన్ కాల్స్.. సర్పంచ్ వేధింపులపై మహిళా ఉద్యోగి కన్నీరు!?

by Jakkula.Mamatha |

ప్రభుత్వ నిబంధనలకు లోబడి, నిఖార్సైన విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగికి స్థానిక క్షేత్రస్థాయిలో రక్షణ కరువైంది.

నడిరోడ్డుపై దుర్భాషలు, గంటగంటకూ ఫోన్ కాల్స్.. సర్పంచ్ వేధింపులపై మహిళా ఉద్యోగి కన్నీరు!?
X

దిశ,అనంతగిరి: ప్రభుత్వ నిబంధనలకు లోబడి, నిఖార్సైన విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగికి స్థానిక క్షేత్రస్థాయిలో రక్షణ కరువైంది. ప్రజాప్రతినిధి హోదాలో ఉండి సిబ్బందికి అండగా నిలవాల్సిన సర్పంచే.. నిబంధనలు బేఖాతరు చేస్తూ, మహిళా ఉద్యోగిని నడిరోడ్డుపై అవమానించి, విధులకు ఆటంకం కలిగించిన అరాచక ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో చోటుచేసుకుంది. సర్పంచ్ చేసిన మానసిక వేధింపులు తట్టుకోలేక సదరు మహిళా ఉద్యోగి తన బీఎల్ఓ విధులకు రాజీనామా చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

గంట గంటకూ ఫోన్లు.. సర్పంచ్ హుకూం!

మండల పరిధిలోని పాలవరం తండా గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్ విజయ.. ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్ఓ) గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే స్థానిక సర్పంచ్ భూక్యా నారాయణ ఆమె విధులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి, తనకు నచ్చిన రీతిలో సర్వే రికార్డులను నమోదు చేయాలంటూ విజయపై ఆయన ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా గంట గంటకూ సదరు మహిళా బీఎల్ఓకు ఫోన్లు చేస్తూ మానసిక వేధింపులకు గురిచేశారు. ఇందుకు విజయ నిరాకరించడంతో, ఆగ్రహానికి గురైన సర్పంచ్ ఆమెను తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, అవమానకరంగా ప్రవర్తించి బెదిరింపులకు దిగారు. సర్పంచే కాకుండా సర్పంచ్ కుమారుడు కూడా అంగన్వాడి విజయ కుమారుడికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ఊపిరాడని పనిభారం.. అదనంగా అవమానాలు!

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, పిల్లల సంరక్షణ చూసే అంగన్‌వాడీలకు ఇచ్చే అరకొర వేతనానికి వారు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కేంద్రాలను నడుపుతూనే.. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఈ ఓటర్ల సవరణ విధులను నిర్వహిస్తున్నారు. ఇంతటి కఠినమైన పరిస్థితిల్లో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిపై, సర్పంచ్ నారాయణ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దౌర్జన్యానికి దిగడం పై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సర్పంచ్ వేధింపుల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురైన విజయ.. "ఈ ఒత్తిళ్ల మధ్య నేను పనిచేయలేను" అంటూ గురువారం మండల డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్‌ను కలిసి తన బీఎల్ఓ విధుల రాజీనామా పత్రాన్ని సమర్పించారు.

క్రిమినల్ కేసులు నమోదు చేయాలి: కార్మిక సంఘాల డిమాండ్

ప్రభుత్వ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని అడ్డుకుని, గంట గంటకూ ఫోన్లతో మానసిక వేధింపులకు గురిచేసిన పాలవరం తండా సర్పంచ్ భూక్యా నారాయణపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం కాకుండా, స్థానిక నేతల ఇష్టారాజ్యానికి సర్వేలు చేయాల్సి వస్తే తాము విధులు నిర్వహించలేమని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి విజయకు న్యాయం చేయాలని, సర్పంచ్ జులూంకు అడ్డుకట్ట వేయాలని, లేనిపక్షంలో విధులను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు

ఇదే విషయమై ఎమ్మార్వో కమలాకర్ ను వివరణ కోరగా.. బీఎల్‌వో అందజేసిన వినతిపత్రం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బీఎల్‌వోపై పని ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో ఇప్పటికే ఒక జీపీఓను నియమించినట్లు చెప్పారు. బీఎల్‌వో, జీపీఓ ఇద్దరూ సమన్వయంతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) ప్రక్రియను పూర్తి చేయాలని సూచించినట్లు వెల్లడించారు. అలాగే, వినతిలో చేసిన ఆరోపణలపై అవసరమైన వివరాలు సేకరించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story