డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం.. కోదాడ రూరల్ ఎస్‌ఐ వీఆర్‌కు అటాచ్!

by Jakkula.Mamatha |

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా జరిగిన ఘటన పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం.. కోదాడ రూరల్ ఎస్‌ఐ వీఆర్‌కు అటాచ్!
X

దిశ, కోదాడ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన సందర్భంగా జరిగిన ఘటన పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. సూర్యాపేట జిల్లా కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ గోపాల్‌ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ ఆయనను వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర నియోజకవర్గానికి వెళ్తున్న సమయంలో ముందస్తుగా నిర్ణయించిన అధికారిక మార్గాన్ని అనుసరించకుండా, ప్రత్యామ్నాయ మార్గంలో వాహనాలను తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. ఘటనపై వెంటనే రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన భట్టి విక్రమార్క, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు.

అనంతరం జోనల్-2 ఐజీతో పాటు సూర్యాపేట జిల్లా ఎస్పీని ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టిని కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వివరణ అనంతరం ఎస్‌ఐ గోపాల్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ గోపాల్‌ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు చేపట్టిన అధికారులు, ఆయనను వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల షెడ్యూల్, భద్రతా నిబంధనలను అమలులో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమనే సంకేతాన్ని ఈ చర్యల ద్వారా ప్రభుత్వం ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఘటనపై మరింత లోతైన విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Next Story