శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భారీ దొంగతనం.. ఆలస్యంగా వెలుగులోకి!?

by Jakkula.Mamatha |

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని అంజనాపురం గ్రామం వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది.

శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భారీ దొంగతనం.. ఆలస్యంగా వెలుగులోకి!?
X

దిశ,తల్లాడ: ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని అంజనాపురం గ్రామం వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగలు అంజనాపురం శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్‌ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆలయంలోని స్వయంభు ఆంజనేయ స్వామి విగ్రహం పై ఉన్న వెండి కిరీటం, వెండి కన్ను, 108 వెండి తమలపాకులను అపహరించారు.

దొంగిలించిన వెండి ఆభరణాల బరువు సుమారు 500 గ్రాములు ఉంటుందని అంచనా. వీటితో పాటు ఆలయ హుండీని సైతం పగలగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. రోజువారీ లాగే గుడి శుభ్రం చేయడానికి వచ్చిన సిబ్బంది ఆలయ తాళాలు, హుండీ పగలగొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై అంజనాపురం ఉపసర్పంచ్ కేతినేని చలపతిరావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తల్లాడ ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Next Story