మా వైన్స్.. మా ఇష్టం..?

by Batti.Sumithra |

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ, అదే సమయంలో మహారాష్ట్రకు అక్రమంగా సరఫరా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వేమనపల్లిలో వినిపిస్తున్నాయి.

మా వైన్స్.. మా ఇష్టం..?
X

దిశ, వేమనపల్లి : ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ, అదే సమయంలో మహారాష్ట్రకు అక్రమంగా సరఫరా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వేమనపల్లిలో వినిపిస్తున్నాయి. మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయల్లా విస్తరిస్తుండగా, అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే వేమనపల్లి మండల కేంద్రంలోని వైన్స్ షాపులో ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రానికి సరిహద్దుగా ప్రవహించే ప్రాణహిత నది అవతల ఉన్న మహారాష్ట్రకు అధిక ధరలకు మద్యం అక్రమంగా సరఫరా చేస్తూ మద్యం దందాను జోరుగా కొనసాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజూ వేమనపల్లి నుంచి లక్షల రూపాయల విలువ చేసే మద్యం నాటు పడవల ద్వారా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ మద్యానికి మహారాష్ట్రలో భారీ డిమాండ్ ఉండటాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ రవాణా చేపడుతూ, అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, వేమనపల్లిలోని మద్యం ప్రియులు తమకు కావాల్సిన బ్రాండ్ అడిగితే "స్టాక్ లేదు" అని చెప్పి, అదే మద్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. వేమనపల్లి మండల కేంద్రంలో ఒకే వైన్స్ షాప్ ఉన్నప్పటికీ, మండల వ్యాప్తంగా వందకు పైగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బెల్ట్ షాపుల నిర్వాహకులకు ప్రతి క్వార్టర్ బాటిల్‌ పై రూ.10 నుంచి రూ.20 వరకు, ఫుల్ బాటిల్‌ పై రూ.40 నుంచి రూ.60 వరకు, ప్రతి బీర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తూ బెల్ట్ దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రతి గ్రామంలో కిరాణా దుకాణాలను అడ్డాగా చేసుకుని బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గ్రామాల్లో బెల్ట్ షాపులకు ఎలాంటి అనుమతులు లేకపోయినా, వైన్స్ షాప్‌ను కేంద్రంగా చేసుకుని ఈ దందా కొనసాగుతోంది. మండలంలోని కొన్ని ప్రాంతాల్లో మినీ వైన్స్ షాపుల మాదిరిగా వాహనాల ద్వారా మద్యం తెచ్చి నిల్వ ఉంచి, ఇతర బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

కిరాణా దుకాణాల్లో నిషేధిత వస్తువులు, పదార్థాలు విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ, అధిక శాతం బెల్ట్ షాపులను కిరాణా దుకాణాల యజమానులే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బెల్ట్ షాపులపై ఎలాంటి తనిఖీలు లేకుండా, వైన్స్ యజమానుల సహకారంతో గ్రామాల్లో మద్యం ప్రియులకు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ షాపులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. గ్రామాలను గుడుంబా రహితంగా మారుస్తామని చెప్పే అధికారులే, బెల్ట్ షాపుల నిర్వాహకులకు అండగా నిలుస్తూ అక్రమ మద్యం విక్రయాలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వైన్స్ షాప్ నిర్వాహకులు ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.. హరి, ఎక్సైజ్ సీఐ, చెన్నూర్

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వైన్స్ షాపులు నిర్వహించాల్సి ఉంటుందని ఎక్సైజ్ సీఐ హరి తెలిపారు. షాపుల్లో తనిఖీలు నిర్వహించి, అక్రమ రవాణా, అక్రమ సరఫరా లేదా ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు మద్యం విక్రయించినట్లు తేలితే సంబంధిత వారి పై శాఖాపరంగా, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Next Story