వత్తుగుండ్ల పాఠశాల వంట ఏజెన్సీ సస్పెండ్

by Ratna Kumari |

విద్యార్థులకు నాసిరకం మధ్యాహ్న భోజనం వడ్డించడంపై కలెక్టర్ ప్రియాంక చర్యలు తీసుకుని వంట ఏజెన్సీని సస్పెండ్ చేశారు.

వత్తుగుండ్ల పాఠశాల వంట ఏజెన్సీ సస్పెండ్
X

దిశ, నారాయణపేట ప్రతినిధి : దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లోపాలపై జిల్లా కలెక్టర్ ప్రియాంక కఠిన చర్యలు తీసుకున్నారు. పాఠశాలకు మంగళవారం ఆకస్మికంగా వెళ్లిన ఆమె విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం వెజిటబుల్ కర్రీ, సాంబార్ ఇవ్వాల్సి ఉండగా, విద్యార్థులకు నీటి శాతం అధికంగా ఉన్న చారును మాత్రమే వడ్డిస్తున్నట్లు గుర్తించిన కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజన నాణ్యతను పరిశీలించకుండా, రుచి చూడకుండా విద్యార్థులకు ఎలా వడ్డించారని సంబంధిత ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు.

ఈ ఘటనపై వెంటనే స్పందించిన కలెక్టర్ వంట ఏజెన్సీని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. నాలుగు రోజుల్లో గ్రామంలోని అర్హులైన ఓటర్లందరి నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి డిజిటలైజేషన్ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సాయిబాబా, తహసీల్దార్ తిరుపతయ్య, బీఎల్‌వో, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Next Story